విశాఖపట్నంలో కిడ్నాప్ కథ సుఖాంతమైపోయింది. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే బంధీలు సురక్షితంగా బయటపడ్డారు. ఫిర్యాదు రాగానే పోలీసుల బృందాలు వెంటనే రంగంలోకి దిగి కిడ్నాప్ చేసిన వారిని పట్టుకున్నాయి. నిందితులను పోలసుస్టేషన్ కు బందీలను ఇళ్ళకు చేర్చారు. అంతాబాగానే ఉంది కానీ అసలు అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కిడ్నాప్ కు గురైంది ఎవరో మామూలు జనాలు కాదు. ఏకంగా వైజాగ్ ఎంపీ అందులోను అధికారపార్టీకి చెందిన ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం.
ఎంపీ హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఎంపీ భార్య జ్యోతి, కొడుకు శరత్ చౌదరిని నిందితుడు అలియాస్ రౌడీషీటర్ హేమంత్ కిడ్నాప్ చేశాడు. హేమంత్ ముందు శరత్ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి తల్లి జ్యోతిని పిలిపించుకున్నాడు. ఆమెతో ఫోన్ చేయించి ఎంపీకి అత్యంత సన్నిహితుడు, ఆడిటర్ అయిన గన్నమనేని ఆంజనేయులను పిలిపించుకున్నాడు. అంటే హేమంత్ ముగ్గురిని తన బంధీలుగా ఉంచుకున్నాడు. తర్వాత ఎంపీకి ఫోన్ చేయించాడు. రు. 50 కోట్లు అడిగినట్లు ప్రచారంలో ఉంది.
విషయం తెలియగానే ఎంపీ హైదరాబాద్ నుండి విశాఖ చేరుకున్నారు. ఇంతలోనే విషయం పోలీసులకు చెప్పగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి నిందితుడితో పాటు ముగ్గురిని ఎంపీ కొడుకు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. ఇక్కడే కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. కిడ్నాప్ చేయదలచుకున్న వాడు పవర్ ఫుల్ ఎంపీ, వ్యాపారవేత్త అయిన ఎంవీవీ కొడుకు, భార్యనే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ?
డబ్బులు కావాలంటే ఇంకెవరైనా రియాల్టర్ లేదా వ్యాపారి కుటుంబాన్ని చేసుండేవాడు. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పోలీసులు వెంటన రంగంలోకి దిగుతారని తెలీదా ? పోని కిడ్నాప్ చేసినపుడు పోలీసులకు తెలిసిపోయేట్లుగా మొబైల్ వాడడు కదా. కిడ్నాప్ చేసినవాడు బందీలను గుర్తుతెలీని ప్రాంతంలో దాచిపెడతాడు కానీ ఎంపీ కొడుకింట్లోనే ఉంచుతాడా ? అసలు తెరమీద కనిపిస్తున్న హేమంత్ కాకుండా తెరవెనుక ఇంకెవరో ఉన్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయాలు ఎప్పుడు బయటపడతాయో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి