అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబునాయుడు మధ్య మొదలైన ఆధిపత్య గొడవలు తీవ్రస్ధాయికి చేరుకుని రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత శతృత్వంగా మారిపోయింది. అందుకనే రెండుపార్టీల మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగ తయారైంది. విషయం ఎంతచిన్నదైనా వివాదం మాత్రం బాగా పెద్దదైపోతోంది. అలాంటిది స్కిల్ స్కామ్ లో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేస్తే ఇక వ్యవహారం ఎలాగుంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఇప్పుడు సమస్య ఏమిటంటే రెండుపార్టీల మధ్య ఆధిపత్య గొడవల్లోకి భువనేశ్వరి, బ్రాహ్మణిని దింపేశారు. 22 రోజులుగా  చంద్రబాబు రిమాండులో ఉండటం, లోకేష్ అరెస్టు కూడా తప్పదనే ప్రచారంతో ముందుజాగ్రత్తగా భువనేశ్వరి, బ్రాహ్మణిని దింపేశారు. దీనివల్ల ఏమైందంటే తండ్రి, కొడుకుల రాజకీయానికి  బ్రాహ్మణి బలైపోతోంది. చాలాకాలంగా చంద్రబాబు, లోకేష్ ఏ విషయం మాట్లాడినా జగన్ను శాడిస్టు సీఎం,  సైకో సీఎం అని రకరకాలుగా కామెంట్ చేస్తు తమ కసినంతా తీర్చుకుంటున్నారు.

ఇపుడు కొత్తగా రాజకీయ తెరమీదకు వచ్చిన బ్రాహ్మణితో కూడా జగన్ను సైకో సీఎం అనిపిస్తున్నారు. దాంతో మంత్రులు రోజా, అంబటి రాంబాబు, బొత్స, మాజీ మంత్రులు పేర్నినాని, ఎంఎల్సీ వరుదు కల్యాణి, ఎంపి విజయసాయిరెడ్డి తదితరులంతా బ్రాహ్మణిని వాయించి పడేస్తున్నారు. తాత ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి, చావుకు కారణమైన చంద్రబాబే అసలైన సైకో అంటు దుమ్ము దులిపేస్తున్నారు. జగన్ను సైకో అంటే మర్యాదగా ఉండదని వార్నింగిస్తున్నారు.

జగన్ను పట్టుకుని బ్రాహ్మణి నాలుగు మాటలు అనటం ఆలస్యం మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు బ్రాహ్మణిని తలా పదిమాటలంటున్నారు. పనిలోపనిగా చంద్రబాబు, బాలయ్య, లోకేష్ చరిత్రను తవ్వితీస్తున్నారు. జగన్ గురించి మాట్లాడేముందు ఇంట్లో వాళ్ళ చరిత్రలు తెలుసుకుని మాట్లాడాలంటున్నారు. బ్రాహ్మణికేమో రాజకీయాలు కొత్త. మంత్రులేమో రాజకీయాల్లో పండిపోయున్నారు. కాబట్టి బ్రాహ్మణి రెండు మాటలనగానే వాళ్ళు ఇరవై మాటలు అనేస్తున్నారు. దాన్ని బ్రాహ్మణి గట్టిగా తిప్పికొట్టలేకపోతోంది. జనాల సింపతీని సంపాదించాలన్న దురుద్దేశ్యంతో అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకురావటంతో ప్రత్యర్ధుల ధాటికి బ్రాహ్మణి బలైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: