
కొన్ని నియోకవర్గాల్లో జనాలు పోలింగును బహిష్కరించారు. గురువారం ఉదయం నుండి పోలింగ్ మొత్తం 119 నియోజకవర్గాల్లోను మందకొడిగానే జరిగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు సగటున 37 శాతం పోలింగ్ కూడా నమోదుకాలేదు. వివిధ కారణాలతో హైదరాబాద్, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ రకరకాలుగా జరిగింది. అయితే ఈ పరిస్ధితుల్లో కూడా కొన్ని గ్రామాల్లో పోలింగ్ ను జనాలు బహిష్కరించారు. సత్తుపల్లి, వైరా, మహబూబాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు.
సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గిరిజన గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని చెప్పి జనాలు పోలింగులో పాల్గొనలేదు. వైరా నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో కూడా ఓటర్లు పోలింగును బహిష్కరించారు. ఏన్కూరు మండలంలోని మేడేపల్లి గ్రామంలో రోడ్లు వేయలేదని, మంచి నీటి సౌకర్యం కల్పించలేదని, మౌళిక సదుపాయాలు కల్పించలేదని 20 ఏళ్ళుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపోయారు. రాజులపాలెం గ్రామంలో రోడ్డు వేయకపోవటంతో పోలింగ్ బహిష్కరించారు.
మహబూబాబాద్ నియోజకవర్గంలోని సంతూలాల్ గ్రామంలో డబ్బిస్తే కానీ ఓట్లేయమని గ్రామస్తులు భీష్మించుకుని కూర్చున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లేయటం నేరమని అధికారులు చెప్పినా ఎస్సీ కాలనీ ఓటర్లు పట్టించుకోలేదు. మధ్యాహ్నం వరకు కాలనీలోని ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. డబ్బిస్తే కానీ పోలింగ్ కేంద్రానికి వచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లిలో ఓట్లను బహిష్కరించారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పించలేదన్న కోపంతోనే వీళ్ళు ఓటింగును బహిష్కరించారు.
మామూలుగా తమ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని, కాలనీ సమస్యలను పరిష్కరించలేదనే కారణాలతో జనాలు ఓటింగ్ ను బహిష్కరిచంటం చాలా మామూలే. అయితే ఈసారి ఇలాంటి కారణాలతో పాటు ఓట్లేసేందుకు డబ్బులు ఇవ్వలేదని పోలింగును బహిష్కరించటమే ఆశ్చర్యంగా ఉంది. ఓట్లేసేందుకు డబ్బులు ఇవ్వటం, తీసుకోవటం రెండూ నేరమే. అయితే ఇదంతా ఇపుడు ఓపెన్ సీక్రెట్ లాగ అయిపోయింది. డబ్బులు ఇవ్వటానికీ భయపడటంలేదు అలాగే తీసుకునే వాళ్ళూ భయపడటంలేదు. కానీ డబ్బులు ఇవ్వలేదని చెప్పి పోలింగును బహిష్కరించటమే విస్మయపరుస్తోంది.