
తెలంగాణా ఎన్నికల ఫలితాలపై చంద్రబాబునాయుడులో భయం మొదలైనట్లే ఉంది. ప్రచారంలో కాంగ్రెస్ కు టీడీపీ బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అధికారికంగా చంద్రబాబు మద్దతు ప్రకటించకపోయినా చాలా నియోజకవర్గాల్లో నేతలు, క్యాడర్ కాంగ్రెస్ గెలుపుకు పనిచేసింది వాస్తవం. తెలంగాణా ఎన్నికల ఫలితాలతో పాటు మరో మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. తెలంగాణాలో బీజేపీ పరిస్ధితిని పక్కకు పెడితే మిగిలిన చత్తీస్ ఘడ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలిచింది.
మిజోరంలో సోమవారం కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్స్ గా అందరు చూశారు. ఇలాంటి సెమీఫైనల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దాంతో చంద్రబాబులో భయం మొదలై ఎందుకైనా మంచిదని జాగ్రత్తపడ్డారు. ఇంతకీ చంద్రబాబు పడిన జాగ్రత్త ఏమిటంటే తెలంగాణా ఎన్నికల ఫలితాలకు టీడీపీకి ఎలాంటి సంబంధంలేదని ప్రకటించారు. ఎల్లోమీడియాలోనేమో కేసీయార్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని వార్తులు వస్తుంటే చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటించటం గమనార్హం.
చంద్రబాబు, లోకేష్ పేరుతో పెద్ద ట్వీట్ వచ్చింది. అందులో తెలంగాణా ఎన్నికల ఫలితాలు పూర్తిగా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చిందే అన్నారు. గెలిచిన వాళ్ళకు హుందాగా అభినందనలు చెప్పాలి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేయద్దని నేతలు, క్యాడర్ కు పిలుపిచ్చారు. ఈ ట్వీట్లోనే నరేంద్రమోడీ అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అర్ధమవుతోంది. కాంగ్రెస్ గెలుపులో టీడీపీ పాత్రుందని మోడీ అనుకుంటే తనకు ఇబ్బందులు తప్పవని భయపడినట్లున్నారు.
తొందరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు మోడీ ఏమాత్రం సానుకూలంగా స్పందించటంలేదు. ఇపుడు ఎన్నికల ఫలితాలు వెలువడిన ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గనుక ఓడిపోయుంటే చంద్రబాబు స్పందన ఎలాగుండేదో ఎవరైనా ఊహించగలరు. అయితే అందుకు భిన్నంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలవటమే కాకుండా తెలంగాణాలో కూడా బీజేపీ బలం మూడు స్ధానాల నుండి 8 కి పెరిగింది. దాంతో తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపుకు టీడీపీకి ఎలాంటి సంబంధంలేదని స్వయంగా ప్రకటించారు.