రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీచేయబోయే సీట్లపై మీడియా, సోషల్ మీడియాలో నానా గోల జరుగుతోంది. జనసేన నేతలు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య లాంటి కాపు ప్రముఖులు కూడా మండిపోతున్నారు. ఎందుకంటే పొత్తులో జనసేనకు 25 సీట్లకన్నా ఇవ్వటానికి చంద్రబాబునాయుడు అంగీకరించలేదు కాబట్టి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ మిత్రపక్షాలను తొక్కేయటం మీదే ఉంటుంది. కానీ చంద్రబాబు ఆలోచలనకు పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా  ఉండి 25 సీట్లే మహాప్రసాదంగా భావించారని తెలిసి పార్టీ+కాపు నేతలు ఆశ్చర్యపోతున్నారు.





అయితే ఇక్కడ ఆశ్చర్యపోవటానికి ఏమీలేదు. ఎందుకంటే కాపు ప్రముఖులు లేదా పార్టీ నేతల ఆలోచనల ప్రకారం నడుచుకోవటానికి పవన్ ఎప్పుడూ ఇష్టపడలేదు. ఎవరెంత మొత్తుకున్నా పవన్ కి ఒక టార్గెట్ అనేది ఉంది. అదేమిటంటే పార్టీ ఏమైపోయినా పర్వాలేదు రాబోయే ఎన్నికల్లో తాను గెలవాలి అంతే. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన రెండు ఎన్నికల్లోను ఓడిపోయిన పవన్ను ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏ రేంజిలో ర్యాగింగ్ చేస్తున్నారో చూస్తున్నదే.





ఆ ర్యాగింగ్ ను తట్టుకోలేకపోతున్న పవన్ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒంటరిగా పోటీచేసినా, బీజేపీతో మాత్రమే పొత్తున్నా తన టార్గెట్ రీచ్ కాలేనన్న విషయం పవన్ కు బాగా తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే తన పరిస్ధితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకున్నారు. అందుకనే చంద్రబాబుతో చేతులు కలిపారు. టీడీపీతో పొత్తుంటే మాత్రమే తాను ఎంఎల్ఏగా గెలవగలను అనే నమ్మకంతో పవన్ ఉన్నారు.





కూటమి అధికారంలోకి రావటం, జనసేన పోటీచేసే సీట్లలో గెలవటం, ఎన్నిసీట్లు తీసుకోవాలి ? గెలుపు అవకాశాలు ఎన్నున్నాయి ? అనే విషయాలేవీ పవన్ పట్టించుకోవటంలేదు.  ఇక్కడే పవన్ను అంచనా వేయటంలో కాపులు, జనసేన నేతలు ఫెయిలయ్యారు.  రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానా లేదా అన్నదొకటే పవన్ ఆలోచిస్తున్నది. కూటమి అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు తాను మాత్రం కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. టీడీపీ-జనసేన పొత్తు, జగన్ను ఓడించటం, జనసేన పోటీచేయబోయే సీట్లన్నీ ఉత్త సొల్లుకబుర్లని అర్ధమైపోతోంది. తాను గెలిచితీరాలన్న టార్గెట్ ప్రకారమే పవన్ నడుచుకుంటున్నారని తెలిసిపోతోంది. మిగిలిన వన్నీ ఉత్త కతలు మాత్రమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: