పవన్‌ కళ్యాణ్ రాజమండ్రి టూర్ తర్వాత రూరల్‌ నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. తెలుగుదేశం వర్సెస్‌ జనసేన ఫైటుకు తెర లేచింది. ఈ ఫైట్ ఇలా జరుగుతున్న క్రమంలో X లో బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్ మరింత హీటు పెరిగింది. రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ సీటు తెలుగుదేశం కంచుకోటల్లో ఒకటి. 2019 ఎన్నికల్లో జగన్‌ మోహన్ రెడ్డి గాలి ప్రభంజనంగా వీచిన వేళ కూడా టీడీపీ నిలబెట్టుకున్న సీట్లలో రాజమండ్రి రూరల్‌ ఒకటి.అక్కడ్నించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి సీటుపై రెండు పార్టీల నేతలు కర్చీఫ్‌ వేసుకుని కూర్చున్నారు.అయితే పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి టూర్‌ తర్వాత సీన్‌ అంతా కూడా మారిపోయింది.ఈ పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్‌ టికెట్‌ జనసేన పార్టీకే అని పవన్‌ క్లారిటీ ఇచ్చారంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్‌. తనను ఇక్కడ్నించే పోటీ చేయమని పవన్‌ కళ్యాణ్ ఆదేశించారంటున్నారు దుర్గేష్‌. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో పవన్‌ మాట్లాడారని తాము భావిస్తున్నామంటున్నారు జనసేన నేతలు.


ఇక జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య పీటముడిలా మారిన రాజమండ్రి రూరల్‌ సీటుపై తాజాగా బుచ్చయ్య చౌదరి X లో కామెంట్ చేశారు. రూరల్‌ సీటుపై జరుగుతున్న ప్రచారం ఊహాజనితం అని అన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కచ్చితంగా రూరల్‌ సీటు నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు బుచ్చయ్య..ఇక రాజమండ్రి రూరల్‌లో పోటీ చేసేది జనసేనా? టీడీపీనా? బరిలో నిలిచేది బుచ్చయ్యా? దుర్గేషా…ఇప్పుడు ఈ సందేహాలతో తెలుగుదేశం పార్టీ కేడర్‌ సతమతమైపోతోంది. ఇక తన సిట్టింగ్‌ సీటును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడును కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు బుచ్చయ్య. అసలు గోరంట్లకు తెలిసే ఇదంతా జరుగుతోందా.. ఆయనకు తెలుగుదేశం పార్టీ హైకమాండ్‌ నుంచి క్లారిటీ ఉందా లేదా అనే డౌట్స్ కూడా కేడర్‌లో కలుగుతున్నాయి. పవన్‌ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో మాట్లాడారని దుర్గేష్‌ చెప్పడం, సైకిల్‌ సైన్యంలో కలవరాన్ని మరింత పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: