ఏపీ అసెంబ్లీ సీట్లపై బీజేపీ సీనియర్లు కోపంతో రగిలిపోతున్నారు. గత 20 ఏళ్లలో బీజేపీ పోటీ చేయని, అసలు పార్టీ బలంగా లేని స్థానాలను కేటాయించారంటే బీజేపీ రాష్ట్ర నేతలు కోప్పడుతున్నారు. కుట్ర ప్రకారం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సీట్లు సర్ధబాటు చేశారంటూ తీవ్రస్థాయిలో నేతలు మండిపడుతున్నారు.నియోజకవర్గాల వారీగా బీజేపీ ఎందుకు ఈ పది అసెంబ్లీ స్థానాలు తీసుకుంది అనేదీ ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్లు ఆశించిన స్థానాలు కాకుండా అసలు బీజేపీ గత 20 ఏళ్లలో పోటీలో లేనటువంటి స్థానాల్లో  బరిలోకి దిగడం ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్లకు సీట్లు రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరోపక్క ప్రస్తుతం బరిలోకి దిగుతున్న స్థానాల్లో బీజేపీ గెలుస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నేతలు.టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి.  ఎచ్చర్లలో బీజేపీ 2009 వ సంవత్సరంలో పోటీ చేయగా కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014 వ సంవత్సరంలో ఇక్కడ కిమిడి కళా వెంకట్రావు గెలిచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇక 2019లో బీజేపీ తరఫున సూర్య ప్రకాష్ పోటీ చేయగా కేవలం 0.5% ఓట్లు మాత్రమే వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు బరిలోకి దిగుతున్నారు.


 విశాఖ నార్త్.. 2014 కూటమిలో బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు 51.34% ఓట్లతో గెలుపొందారు. అయితే 2019లో మాత్రం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు చేతిలో ఓడిపోయారు. అప్పుడు కేవలం 10.63% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కూడా అక్కడ విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగబోతున్నారు.ఇక అరకులో అయితే అసలు గత 20 ఏళ్లలో  బీజేపీ లేనేలేదు.వచ్చే ఎన్నికల్లో అరకు వ్యాలీ నుండి పంగి రాజారావు బరిలోకి దిగబోతున్నారు. ఇక 2014లో కైకలూరు నుంచి కూటమిలో బరిలోకి దిగిన కామినేని శ్రీనివాస్ 53.80% ఓట్లతో గెలిచారు. గత 20 ఏళ్లలో బీజేపీ ఇక్కడ ఒక్కసారి మాత్రమే గెలిచింది. విజయవాడ వెస్ట్ లో 2014లో బీజేపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది.ప్రస్తుతం సుజనా చౌదరి బరిలోకి దిగబోతున్నారు. బద్వేల్ లో 2009లో మాత్రమే సింగమల వెంకటేశ్వర్లు పోటీ చేయగా 1.05 శాతం ఓట్లు మాత్రమే సంపాదించగలిగారు.


ఇప్పుడు బొజ్జ రోషన్న అనే కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించింది బీజేపీ. జమ్మలమడుగులో కూడా గత 20 సంవత్సరాలలో బీజేపీ పోటీ చేసిందీ లేదు. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. ఆదోని ధర్మవరం ఈ రెండిట్లో కూడా బీజేపీ గత 20 సంవత్సరాలలో పోటీ చేయలేదు. ఇక ప్రస్తుతం ఆదోనిలో డాక్టర్ పివి పార్థసారధి బరిలోకి దిగుతున్నారు. ధర్మవరంలో సత్యకుమార్ పోటీ చేయనున్నారు.ఈ పది స్థానాల్లో బీజేపీ కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే పోటీ చేసింది తప్పా, గత 20 ఏళ్లలో పూర్తి స్థానాల్లో బీజేపీ పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు.ఇక పోటీ చేసిన చోట కూడా ఓటు శాతం కూడా తక్కువే. విశాఖ నార్త్, కైకలూరులో మాత్రమే ఈ 20 ఏళ్లలో బీజేపీ గెలిచింది. ఇక మిగిలిన అన్నిచోట్ల ఆపార్టీ మరుగడే లేదు.అందువల్ల ఇప్పుడు బీజేపీ పోటీ చేయబోతున్న ఈ పది స్థానాల్లో గెలుపు కష్టం అంటున్నారు సీనియర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: