కేసీఆర్ కుమార్తెకు దిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకట్లేదు. ఎన్ని కారణాలు చూపించినా కోర్టు కరుణించట్లేదు. దిల్లీ మద్యం కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు మొర్రో అని కవిత చేస్తున్న వాదనను కోర్టు పట్టించుకోవట్లేదు. దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు నాకు ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని.. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువగా జరిగిందని.. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని కవిత  దిల్లీ హైకోర్టులో చేసిన వాదన పెద్దగా సక్సస్ కాలేదు.


నా ఫోన్‌ నెంబర్‌ను ఛానళ్లలో ప్రసారం చేసి నా గోప్యతను దెబ్బతీశారని.. దిల్లీ మద్యం కేసులో 4 సార్లు విచారణకు హాజరయ్యానని.. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించానని.. నా మొబైల్ ఫోన్లు అన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశానన.. ఫోన్లు ధ్వంసం చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత దిల్లీ హైకోర్టు మహిళా జడ్జికి లేఖ కూడా రాశారు.


రెండున్నర ఏళ్లుగా సోదాలు జరిపారు.. వేధింపులకు గురిచేశారని.. సాక్షులను బెదిరిస్తున్నట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారని.. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని కవిత ఆవేదన వ్యక్తం చేసారు. 95 శాతం కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబంధించినవేనంటున్న  కవిత.. బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందని.. విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు ఆశతో చూస్తున్నాయని చెప్పుకున్నా.. కోర్టు మాత్రం కవితను కరుణించలేదు.


కేసు దర్యాప్తునకు సహకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నానని కవిత అంటున్నారు. అంతే కాదు.. నా చిన్నకుమారుడి పరీక్షలకు తల్లిగా నేను తనతో ఉండాలని.. నేను లేకుంటే నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడవచ్చని చేసిన సింపతీ వాదనను కూడా కోర్టు పెద్దగా పట్టించుకోలేదు. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నానని కవిత మొర పెట్టుకున్నా కోర్టు కరుణించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: