ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకు చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీరంగనాథరాజు 2004 సంవత్సరంలో అత్తిలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజేతగా నిలిచారు. 2009 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న శ్రీరంగనాథరాజు 2011 సంవత్సరంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణపై గెలిచిన శ్రీరంగనాథరాజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.
 
అయితే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేస్తున్నారు. ఇద్దరూ మాజీ మంత్రులు కాగా రాజకీయ అనుభవం ఉన్న ఈ ఇద్దరు నేతలలో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాల్సి ఉంది. మరోవైపు ఆచంటలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండటం గమనార్హం. 2009 ఎన్నికల నుంచి ఈ సెంటిమెంట్ నిజమవుతోంది.
 
ఆచంట జనరల్ నియోజకవర్గంగా మారిన తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009, 2014 సంవత్సరాలలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి పితాని ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం పితానికి చెరుకువాడ షాకిచ్చారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండగా పితానికి ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. 2004 సంవత్సరం వరకు ఈ నియోజకవర్గం ఎస్సీ స్థానంగా ఉండేది.
 
ఈ ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవి చేపడతానని చెరుకువాడ చెబుతుండగా ఆయన నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. తాను చేసిన అభివృద్ధి పనులే తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. జగన్ దృష్టిలో కూడా చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంచి పేరు ఉంది. రంగనాథరాజుకు మరోసారి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావాలని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు  ఎంతో కష్టపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: