
కెప్టెన్ సుమిత్ సభర్వాల్ జూనియర్ ఏమీ కాదు.. చాలా అనుభవజ్ఞుడైన పైలట్. అతను 8200 గంటలు విమానయాన అనుభవం కలిగి ఉన్నారు. సుమిత్ సభర్వాల్ తల్లి రెండేళ్ల క్రితం చనిపోగా.. 88 ఏళ్ల తండ్రి ముంబైలోని పోవై ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. వయోభారంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు సుమిత్ సభర్వాల్ తరచూ వెళ్లేవారు.
కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం మానేసి నాన్నను దగ్గర ఉండి చూసుకోవాలని సుమిత్ భావించారు. మూడు రోజుల క్రితం ఇదే విషయాన్ని తండ్రికి చెప్పగా.. ఆయన తెగ సంబరపడ్డారు. కానీ ఇంతలోనే ఘోరం చోటుచేసుకుంది. నాన్న కోసం ఉద్యోగం మానేయాలనుకున్న కెప్టెన్ సుమిత్.. నిన్న జరిగిన అహ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్‌లో ఏకంగా ప్రాణాలనే వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి కొన్ని గంటల ముందే సుమిత్ తండ్రితో మాట్లాడారు. లండన్ చేరుకున్న వెంటనే మీకు ఫోన్ చేస్తానని చెప్పారట. అదే తండ్రితో సుమిత్ మాట్లాడిన చివరి మాటలు. ఇక కొడుకు దూరం కావడంతో ఆ ఒంటరి తండ్రి మరింత తల్లడిల్లిపోతున్నారు. దీంతో పలువురు అధికారులు, రాజకీయ నాయకులు ఆయన ఇంటికి చేరుకుని ఓదారుస్తున్నారు.
కాగా, క్రాష్ అయిన ఫ్లైట్‌కు క్లైవ్ కుందర్ కోపైలట్. ఈయన బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బంధువు. క్లైవ్ కుందర్ కూడా 1,100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం కలిగి ఉన్నాడు. అతని తల్లిదండ్రులు సిడ్నీలో ఉంటున్నారు. క్లైవ్ మరణంతో అతని కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది.