
చైనాలో కొన్ని దశాబ్దాల పాటు అమలు చేసిన 'ఒకే బిడ్డ' విధానం ఇప్పుడు ఆ దేశాన్ని తీవ్ర జనాభా సంక్షోభంలోకి నెట్టింది. దీనికి తోడు పెళ్లిళ్ల సంఖ్య దారుణంగా పడిపోవడం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆధునిక చైనా యువతులు పెళ్లి విషయంలో కఠినమైన షరతులు విధిస్తున్నారు. ఆరు అంకెల జీతం, సొంత ఇల్లు, విలాసవంతమైన జీవితం ఇవ్వాలని, అదే సమయంలో అత్తమామల బాధ్యత మాత్రం తాము తీసుకోమని తెగేసి చెబుతున్నారు. దీంతో భయపడిపోయిన యువకులు పెళ్లికి బదులు సహజీవనాన్నే ఎంచుకుంటున్నారు. ఫలితంగా జననాల రేటు పాతాళానికి పడిపోయింది.
ఈ పెను సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనా ప్రభుత్వం ఒక సాహసోపేతమైన, వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు చేసుకునేలా పురుషులను ప్రోత్సహించడమే లక్ష్యంగా విడాకుల చట్టంలో కఠినమైన మార్పులు చేసింది.
ఈ కొత్త రూల్ ప్రకారం, విడాకులు తీసుకున్న తర్వాత భర్త తన మాజీ భార్యకు జీవితాంతం భరణం (Alimony) చెల్లించాల్సిన అవసరం లేదు. విడిపోయే సమయంలో ఇద్దరి అంగీకారంతో ఒకేసారి ఇచ్చే సెటిల్‌మెంట్‌తో (One-Time Settlement) బంధం తెగిపోతుంది. ఆ తర్వాత భర్తకు ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండదు. జీవితాంతం భరణం కట్టాలనే భయంతో పెళ్లికి దూరమవుతున్న పురుషులకు ఈ చట్టం ఒక వరంగా మారింది.
ఇది మగవాళ్లపై ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు. దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి, యువతను పెళ్లిళ్ల వైపు మళ్లించి, జననాల రేటును పెంచడానికి ప్రభుత్వం వేసిన ఒక వ్యూహాత్మక అడుగు. చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. ఇది వైవాహిక బంధం, బాధ్యతలు, హక్కులపై కొత్త వాదనలకు తెరలేపింది.