బీజేపీ - టీడీపీ పొత్తు 11 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది (మధ్యలో ఐదేళ్ల విరామం తప్ప) , కానీ కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీకి ఇప్పటివరకు గవర్నర్ పదవి దక్కలేదు. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. టీడీపీ సీనియర్ నాయకుడు, రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేసిన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమించారు . అశోక్ రాజకీయ ప్రస్థానం విశిష్టమైనది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా , కేంద్ర విమానయాన మంత్రిగా పనిచేసిన ఆయన 1978 లో రాజకీయాల్లోకి వచ్చారు . అప్పటినుంచి 1999 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు . 2004లో ఓటమి ఎదురైనా , 2009 లో తిరిగి గెలిచి , 2014లో ఎంపీగా ఎన్నికై మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు .

ఇక  గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె అదితి విజయలక్ష్మి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు .ఇటీవల టీటీడీ చైర్మన్ పదవి పై ఊహాగానాలు ఉన్నా, అది బీఆర్ నాయుడికి దక్కింది . దీంతో, పార్టీ వర్గాలు అశోక్ కి గవర్నర్ పదవి తగినదేనని భావించాయి. చివరకు గోవా గవర్నర్‌గా నియామకం ద్వారా ఆయనకు గౌరవప్రదమైన పదవి దక్కింది . అయితే , గోవా లాంటి చిన్న రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించడాన్ని కొంతమంది టీడీపీ వర్గాలు పెద్దగా సంతృప్తిగా చూడటం లేదు. ఆయన స్థాయికి, అనుభవానికి తగిన పెద్ద రాష్ట్రం గవర్నర్‌షిప్ ఇవ్వాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు హరియాణా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను పదవి నుంచి తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది . 77 ఏళ్ల దత్తన్న గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కూడా పనిచేశారు . ఇప్పుడు ఆయనను తప్పించడం వెనుక రాజకీయ ప్రణాళిక ఉందా ? లేక ఆయనను మరొక పెద్ద రాష్ట్రాని కి గవర్నర్ గా పంపాలనుకుంటున్నారా ? అనేది సమయం చెప్పాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కేంద్రం లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . మోదీ ప్రభుత్వం , టీడీపీ కి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందన్న దాని పై తాజా గవర్నర్ నియామకాలు కొంత ఆలోచన కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: