( విజ‌య‌వాడ‌ - ఇండియా హెరాల్డ్ )

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండవు అన్న నానుడి తరచుగా నిజమవుతూనే ఉంది. అవ‌స‌రం, అవ‌కాశం అనే రెండు పదాల చుట్టూ తిరుగుతున్న ఆధునిక రాజ‌కీయాల వాస్త‌వం మరోసారి స్పష్టమవుతోంది. ఇటీవ‌ల వైసీపీకి చెందిన కీలక నేత వెల్లంప‌ల్లి శ్రీనివాస్ తిరిగి తన పాత గూటికి వెళ్లే యోచనలో ఉన్నారని సమాచారం. వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు రాజకీయ అనుభవం, చాతుర్యం రెండూ ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆయ‌న, రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభించి 2009లో తొలి విజయం సాధించారు. కానీ ఆ పార్టీ అనంతరం కాంగ్రెస్‌లో విలీనమవడంతో, అక్కడ జలీల్ ఖాన్‌తో ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్‌లోకి వెళ్ళకుండా, బీజేపీలోకి చేరారు. 2014లో బీజేపీ తరఫున పోటీ చేసినా, విజయం సాధించలేకపోయారు. ఆపై బీజేపీని కూడా వదిలి, 2019లో వైసీపీలోకి వెళ్లారు.  విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి గెలిచి, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. వైశ్య వర్గానికి చెందిన ఆయ‌న, సామాజికంగా కూడా ప్రాధాన్యత ఉన్న నేతగా ఎదిగారు.


అయితే 2024లో జగన్ ఆయ‌న నియోజకవర్గాన్ని మార్చి సెంట్ర‌ల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఈ మార్పు ఆయ‌నకు పెద్ద ఇబ్బందిగా మారింది. మల్లాది విష్ణుతో విభేదాలు, నియోజకవర్గ మార్పుతో ఆయ‌న ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీలో తన పాత మిత్రుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో వెల్లంప‌ల్లి మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్‌లో మాధవ్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీలో విజయవాడ పశ్చిమ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, వెల్లంప‌ల్లికి అవకాశం ఇవ్వాలా వద్దా అనే విషయంలో పీవీఎన్ మాధవ్ ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనుకుంటే, ఆయన స్థానాన్ని వెల్లంప‌ల్లికి అప్పగించే అవకాశం ఉందని విశ్లేషణ. ఫైన‌ల్‌గా చూస్తే వెల్లంప‌ల్లి బీజేపీలో చేరుతారా? లేక మరో ట్విస్ట్ వస్తుందా ? అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: