
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో విస్తరణ లేదా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముగ్గురు నుంచి నలుగురు మంత్రులను మార్చే అవకాశముందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా శాసన మండలి నుంచి కూడా నాయకులను మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై చర్చ మొదలైంది. గతంలో చంద్రబాబు హయాంలో శాసన సభ, శాసన మండలి రెండింటి నుంచి మంత్రులు తీసుకోవడం సాధారణమే. 2014–2019 మధ్యకాలంలో యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, నారాయణ వంటి నాయకులు మండలికి చెందిన వారే అయినా కూడా వారికి మంత్రి పదవులు దక్కాయి. అయితే ఈసారి మాత్రం ఆయన కేబినెట్‌లో ఉన్న ప్రతీ మంత్రి కూడా శాసన సభకు ఎన్నికైన వారే కావడం గమనార్హం. ఇది శాసన మండలిలో ప్రభుత్వం తరఫున బలమైన వాయిస్ లేకుండా పోవడానికి కారణమైంది.
ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో, ముఖ్యంగా శాసన మండలిలో ప్రభుత్వ ప్రాతినిధ్యం బలంగా ఉండాలన్న ఆవశ్యకత ఉంది. మండలి సభ్యులలోంచి కూడా మంత్రులకు అవకాశం ఇవ్వాలని టీడీపీలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కావలి గ్రీష్మ పేరు చర్చల్లో ఉంది. ఆమెను అసలు మండలిలోకి తీసుకువచ్చిన ఉద్దేశమే వైసీపీకి తగిన కౌంటర్ ఎటాక్‌లు ఇచ్చేందుకు. ఆమెకు అవకాశం ఇవ్వకపోతే సీమ ప్రాంతానికి చెందిన ఓ కీలక నేతకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణలు, మరియు రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకోనున్నారని తెలుస్తోంది. మరి కొత్త మంత్రి వర్గంలోకి ఎవరు ? వస్తారు ? మండలికి ప్రతినిధులుగా ఎవరిని ఎంపిక చేస్తారు? అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు