ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల అనగానే ఒక్క పేరు గుర్తుకు వస్తుంది – వైఎస్ కుటుంబం. 1978 నుంచి దాదాపు 13 సార్లు ఇక్కడ గెలిచి, ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటగా మార్చుకుంది వైఎస్ కుటుంబం. కానీ, ఈసారి అక్కడే రాజకీయ చరిత్ర మారిపోయింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ సంచలన విజయం సాధించింది.టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డి 6,735 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 685 ఓట్లకే పరిమితమయ్యారు. దాదాపు 6 వేల ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధించటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.


కుప్పం నుండి పులివెందుల వరకు – ప్రతీకార రగడ:
2021 మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు బలమైన గడ్డ అయిన కుప్పంను వైసీపీ టార్గెట్ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కసరత్తుతో, 19 వార్డుల్లో వైసీపీ గెలిచి, టీడీపీని కేవలం ఆరు వార్డులకే పరిమితం చేసింది. అప్పట్లో "40 ఇయర్స్ ఇండస్ట్రీ" అన్న చంద్రబాబుకు కుప్పంలో పరాభవం కలగటం వైసీపీ విజయగాధగా మారింది.కానీ రాజకీయాల్లో ప్రతీకారం అన్నది పాత రూల్. ఈసారి టీడీపీ కూడా అదే రూల్ ఫాలో అయింది. కుప్పం ఘోర ఓటమి ప్రతీకారం తీర్చుకోవడానికి, జగన్ గడ్డ పులివెందులనే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ కుటుంబం ఆధిపత్యం దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నా, అక్కడ గెలిస్తే వైసీపీకి మానసిక దెబ్బ ఇస్తామన్నది టీడీపీ ప్లాన్.



ఘన విజయం – భవిష్యత్ రాజకీయాలకు సంకేతం?:
ఈ బైపోల్ కేవలం పదవీ కాలం ఏడాదే ఉన్నప్పటికీ, టీడీపీ దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఇక్కడ గెలవటం ద్వారా, వచ్చే ఏడాది స్థానిక ఎన్నికల్లో కూడా బలంగా నిలబడొచ్చని లెక్క వేసింది. ఆ వ్యూహం ఫలించి, జగన్ గడ్డలో సంచలన విజయాన్ని సాధించింది.రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, పులివెందుల ఓటమి వైసీపీకి మానసిక దెబ్బ మాత్రమే కాదు, కూటమి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇక టీడీపీ మాత్రం, "కుప్పం కధకు రివర్స్ వెర్షన్" అని సంబరపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: