రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో జరపబోతున్న భేటీ రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఎంతో ప్రాధాన్య‌త సంతరించుకుంది. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని వరకు గ్రీన్ ఫీల్డ్ సిక్స్ లేన్ హైవే ఏర్పాటు ప్రతిపాదన ఇద్ద‌రు సీఎం చర్చలో కీలకాంశంగా నిలవనుంది. ఈ రహదారి భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలను మాత్రమే కాకుండా, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, ప్రజా ప్రయాణాల సౌలభ్యం వంటి అంశాలపై కూడా ప్రభావం చూపనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్రం మొత్తం వ్యయంలో 60% నిధులు సమకూర్చనుండగా, మిగిలిన 40% ఇరు రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఎందుకంటే, రహదారి ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ భూభాగం గుండా సాగుతుంది.


సూర్యాపేట నుంచి అమరావతి వరకు దాదాపు 150 కిలోమీటర్ల దూరాన్ని ఏపీ ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి సూర్యాపేట వరకు మాత్రం కేవలం 90 కిలోమీటర్లదే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. ఫ్యూచర్ సిటీని అనుసంధానించడం వల్ల తెలంగాణకు కూడా మేలే జరుగుతుందని వాదిస్తూ, భూసేకరణతో పాటు ఖర్చులో గణనీయమైన భాగాన్ని తెలంగాణ భరించాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. అంతేకాకుండా, తాము గరిష్ఠంగా 10% మేర ఖర్చు భరించగలమని సంకేతాలు ఇస్తోంది. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మీ రాష్ట్రంలో రహదారి ఎక్కువ భాగం ఉన్నందున ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నది తెలంగాణ వైఖరిగా కనిపిస్తోంది.


ఈ వివాదం బనకచర్ల ప్రాజెక్టు తరహాలోనే సవాళ్లను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై కేంద్రం, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలతో ఏపీ ఆందోళనలో ఉంది. ఇలాంటి సమయంలో ఈ హైవే నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, నిధుల పంపకం అంశాలు రెండు రాష్ట్రాల మ‌ధ్య తగాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అయితే మరోవైపు, రెండు రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి, అమరావతి రాజధాని కనెక్టివిటీకి ఈ రహదారి కీలకం కావడంతో చివరికి ఇరువురు ముఖ్యమంత్రులు రాజీ మార్గాన్ని అన్వేషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: