
కొండ ప్రాంతాల్లో గంజాయి సాగు నియంత్రణకు శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ సాయంతో తీసిన ఛాయాచిత్రాలు, వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించాలని ఉపసంఘం సభ్యులు సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అన్ని విద్యాసంస్థల్లో నెలలో ఒక శనివారం ఈగల్ క్లబ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా నెట్ వర్క్ ఆర్థిక మూలాలను ఛేదించి.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని, కేసుల విషయంలో త్వరితగతిన ఛార్జిషీట్లు వేసి వారికి శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగ ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి.. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టాలని సూచించారు.
సమాచార విశ్లేషణకు డ్యాష్ బోర్డు రూపొందించండి
గంజాయి సాగు కోసం అమాయక గిరిజనులను పావులుగా వినియోగిస్తున్నారని, అనర్థాలపై ఐటీడీఏలు, గిరిజిన సంక్షేమ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచారం, కేసుల పురోగతి, నిఘా విభాగం సమాచారం, శాటిలైట్, డ్రోన్ చిత్రాల విశ్లేషణకు ఆర్టీజీఎస్ ద్వారా డ్యాష్ బోర్డ్ రూపొందించాలని ఉపసంఘం సభ్యులు ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలి. గంజాయి, మాదక ద్రవ్యాల మత్తుకు బానిసలైన వారిని అందులో నుంచి బయటపడేసేందుకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డి-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించి మెరుగైన రీతిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.