
ఇప్పుడు రాజకీయ గణాంకాలు మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు మహిళలను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం, “ తల్లికి వందనం ” వంటి పథకాల ద్వారా వారిని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు దసరా కానుకగా మరో రెండు కీలక మహిళా పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పేర్లతో ఈ పథకాలను రూపుదిద్దారు. విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇంట్లో ఉన్న బాలికలు ఉన్నత స్థాయి వరకు చదువుకోవడానికి బ్యాంకుల నుంచి స్వల్ప వడ్డీకి లక్ష రూపాయల వరకు రుణాలను ఇప్పించనున్నారు. వీటిని సులభమైన ఈఎంఐ పద్ధతిలో తిరిగి చెల్లించుకోవచ్చు. ఇక కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వివాహాలు చేసుకునే యువతులకు లక్ష రూపాయల చొప్పున రుణాలు అందిస్తారు. ఈ రెండు పథకాలు పేద మహిళలకు పెద్ద స్థాయిలో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. దీంతో మహిళా వర్గం మళ్లీ చంద్రబాబు వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలపై మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త పథకాలతో కలిపి మహిళల మద్దతు మరింత బలపడుతుందని టీడీపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ పెట్టుకున్న ఆశలు దెబ్బతింటున్నాయి. మహిళలే తమ బలం అన్న వైసీపీకి ఇప్పుడు అదే వర్గం దూరం కావడం పెద్ద నష్టంగా మారవచ్చు. జగన్ ఇప్పటివరకు మహిళా ఓటు బ్యాంకుపై పూర్తి నమ్మకంతో ఉండగా, చంద్రబాబు వ్యూహాత్మకంగా కొత్త పథకాలను తీసుకువచ్చి వారిని ఆకర్షించడం నిజంగా రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.