ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడం వల్ల సంభవించిన ఈ దుర్ఘటనలో ఏకంగా 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదానికి కారణమైన ఈ బస్సుపై అక్షరాలా 16 చలాన్లు ఉన్నాయని రవాణా శాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా, అంటే 9 చలాన్లు 'నో ఎంట్రీ జోన్'లలోకి ప్రవేశించినందుకు పడినవే కావడం బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా, ఈ బస్సు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతుండటం అధికారుల పర్యవేక్షణపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
సాంకేతిక వివరాల ప్రకారం, ఈ బస్సు 2018 సంవత్సరం మే 2వ తేదీన డామన్ డయ్యులో రిజిస్ట్రేషన్ అయింది. ఈ బస్సుకు 2030 సంవత్సరం ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. అలాగే, 2027 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు ఫిట్‌నెస్ ఉండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 20 వరకు ఇన్సూరెన్స్ ఉందని సమాచారం అందుతోంది. ఈ ఘోర ప్రమాదానికి అతి వేగం కారణమా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధికారులు, దర్యాప్తు నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే, చలాన్లు ఉన్న బస్సులను రోడ్లపై తిరగకుండా ఎందుకు అడ్డుకోలేకపోయారనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఈ ఘోరం తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, రోడ్డు భద్రతపై కొత్త చర్చకు తెర తీసింది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం విషయంలో ప్రయాణికులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి