గ్రేటర్ హైద‌రాబాద్ రాజ‌కీయాలు ఇప్పుడు జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌డంతో, మొత్తం 81 నామినేష‌న్ల దాఖ‌లు, ఆ త‌ర్వాత ప‌లు తిర‌స్క‌ర‌ణ‌ల హ‌డావుడి ప‌క్క‌న పెడితే, అస‌లు సంగ్రామం ఇప్పుడే మొద‌లైంది. గ‌త ఆరు నెల‌ల కింద‌ట కంటోన్మెంట్ సిట్టింగ్ సీటును కైవ‌సం చేసుకుని బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్, మ‌రోసారి గులాబీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని కంక‌ణం కట్టుకుంది. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితి చూస్తే, ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీగా ఉండ‌టం ఖాయం. గులాబీకి సెంటిమెంట్.. హ‌స్తానికి వ్యూహం! .. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్‌కు సిట్టింగ్ సీటు. దివంగ‌త మాగంటి గోపీనాథ్ ఇక్క‌డ వరుసగా మూడు విజయాలు సాధించారు. ఉప ఎన్నిక‌లో సానుభూతిని న‌మ్ముకుని, పార్టీ అధినేత కేసీఆర్ ఆయ‌న సతీమణి మాగంటి సునీతను బ‌రిలోకి దించారు. కేసీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగ‌డం, యువ డైనమిక్ నాయ‌కులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు ఉప ఎన్నిక ఇంఛార్జ్‌లుగా బాధ్య‌త‌లు తీసుకోవ‌డం గులాబీ పార్టీకి కీల‌క బ‌లం. ఈ నేత‌ల‌ చురుకుద‌నం, పార్టీ యంత్రాంగం ఇక్క‌డ కీల‌క‌పాత్ర పోషించ‌నుంది.


మ‌రోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక‌ను త‌మ‌కు వ‌చ్చిన గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తోంది. కంటోన్మెంట్ విజయం ఇచ్చిన జోష్‌లో, మ‌రో సిట్టింగ్ సీటును లాక్కోవాల‌ని సకల అస్త్ర శస్త్రాల‌తో సిద్ధ‌మైంది. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా న‌వీన్ యాద‌వ్ వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మా, గ‌తంలో ఓట‌మి పాలైనా నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు ప్ల‌స్‌గా మారాయి. వీటికి తోడు, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక‌పై గ‌ట్టి ఫోక‌స్ పెట్ట‌డం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మజ్లిస్ మద్దతు 'హస్తం'కు వరం! .. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో గెలుపును శాసించేది మైనార్టీ ఓటు బ్యాంకు అన‌డంలో సందేహం లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న మజ్లిస్ (MIM) పార్టీ ఈసారి కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం హ‌స్తం పార్టీకి వ‌రంగా మారింది. మ‌జ్లిస్ మ‌ద్ద‌తుతో ముస్లిం ఓట్ల సెంట్ర‌లైజేష‌న్ కాంగ్రెస్‌కు భారీగా క‌లిసి రానుంది. ఇది బీఆర్ఎస్‌కు గ‌ట్టి మైన‌స్‌గా ప‌రిణమించే అవ‌కాశం ఉంది.



బీజేపీ వైఫల్యం! .. ఈ మ‌హా సంగ్రామంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉండాల్సిన బీజేపీ ఏమాత్రం సీరియ‌స్‌గా క‌నిపించ‌డం లేదు. అభ్య‌ర్థిని సైతం చాలా ఆల‌స్యంగా ఖ‌రారు చేయ‌డం, ఎన్నిక‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆ పార్టీ నిరాస‌క్తత‌ను సూచిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన లంకల దీపక్ రెడ్డికి సీటు ఇచ్చినా, ఆయ‌న‌ కూడా అంత ఆస‌క్తితో ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. మైనార్టీ ఓటు బ్యాంకు కూడా బీజేపీకి పూర్తిగా దూరం కావ‌డం ఆ పార్టీ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తోంది. మొత్తం మీద చూస్తే, జూబ్లీహిల్స్ పోరు.. బీఆర్ఎస్ ప‌ట్టుకోసం చేసే పోరాటం, కాంగ్రెస్ దూకుడు మ‌ధ్యే అన్న‌ది సుస్ప‌ష్టం. హోరాహోరీ పోరులో ఎవ‌రు పైచేయి సాధిస్తారో చూడాలంటే నవంబర్ 14న వచ్చే ఫలితాల కోసం వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: