దేశ రాజకీయ ఉష్ణోగ్రత మళ్లీ పెరగబోతోంది! చలికాలం మొదలుకాకముందే ఢిల్లీలో రాజకీయ వేడి మొదలైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాజాగా ప్రకటించిన ప్రకారం, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 1 నుంచి 19 వరకు జరగనున్నాయి. రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చినందున అధికారికంగా ఈ స‌మావేశాల‌కు రంగం సిద్ధం అయింది. అయితే, ఈ ప్రకటనతోనే ఢిల్లీలో రాజకీయ గాలులు మారిపోయాయి.ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే దాడి మోడ్‌లోకి వెళ్లింది. సమావేశాల వ్యవధి తగ్గించారని, ప్రభుత్వం చర్చలకు భయపడుతోందని ఆరోపిస్తోంది. “ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయి” అని రిజిజు చెప్పగా, దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఫైర్ అయ్యారు. “పార్లమెంట్‌ అనేది చర్చల వేదిక, కానీ ఈ ప్రభుత్వం దానిని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీగా మార్చింది” అంటూ సెటైర్లు పేల్చారు.


కాంగ్రెస్‌ విమర్శల ప్రకారం, గత ఏడాది వింటర్‌ సెషన్‌ నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు – 26 రోజులు కొనసాగగా, ఈసారి కేవలం 19 రోజులు మాత్రమే పెట్టడం ప్రభుత్వ తీరును చూపుతోందని అన్నారు. బిల్లులు ఆమోదం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పార్లమెంట్‌ను వాడుకుంటోందని, ప్రజా సమస్యలపై చర్చకు మాత్రం దూరంగా ఉంటోందని ఆరోపించారు.ఇక అధికార ఎన్డీయే మాత్రం “తక్కువ రోజులు అయినా ఫలప్రదంగా జరగాలని” లక్ష్యంగా పెట్టుకుంది. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత వంటి అంశాలపై చర్చలు జరపాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర నేతలు చెబుతున్నారు. అయితే, ప్రతిపక్షం మాత్రం దీనిని ‘రాజకీయ నాటకం’గా చూస్తోంది.



గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు సాగాయి. కానీ, ప్రతిపక్ష నిరసనలు, బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై గొడవలతో సభలు సరిగా నడవలేదు. ఉత్పాదకతలో కూడా తీవ్ర పతనం చోటుచేసుకుంది — లోక్‌సభలో 31 శాతం, రాజ్యసభలో 39 శాతం మాత్రమే! ఇప్పుడు చలికాల సెషన్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నదే ఆసక్తి. కాంగ్రెస్‌ విమర్శలు, ఎన్డీయే సమాధానాలు — ఈ సారి “శీతాకాలం” కంటే వేడి ఎక్కువగా ఉండబోతోందని రాజకీయ వర్గాల అంచనా. దేశ రాజకీయ దిశను నిర్ణయించే కీలక చర్చలు జరగబోతున్నాయనే భావనతో అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్లింది!

మరింత సమాచారం తెలుసుకోండి: