హైదరాబాద్‌లో పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. “హైదరాబాద్ తాగునీటి సమస్య ఉన్నప్పుడు కృష్ణా నీటిని నగరానికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యుత్ కొరత ఉన్న జంట నగరాలకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాం. అందుకే దిగ్గజ సంస్థలు హైదరాబాద్ వైపు వలస వచ్చాయి” అని అన్నారు. “ హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌గా మారడానికి జైపాల్ రెడ్డి లాంటి నేతల కృషి ఉంది. ఆయన ప్రయత్నాల వల్లే మెట్రో వచ్చింది. రాష్ట్రాన్ని మేము అప్పగించినప్పుడు 60 వేల కోట్ల మిగులు ఉంది. కానీ బీఆర్‌ఎస్ పదేళ్లలో 8 లక్షల 11 వేల కోట్ల అప్పులు మిగిల్చింది ” అని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా రేవంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ 1 లక్ష 87 వేల కోట్లు ఖర్చు చేశారు, కానీ ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి ? ” అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అవినీతి, దుర్వినియోగం పరాకాష్టకు చేరాయని అన్నారు. ఇక కేటీఆర్‌పై నేరుగా విరుచుకుపడుతూ, “సొంత చెల్లిని అవమానించిన వాడు ప్రజలకు న్యాయం చేస్తాడా? కేటీఆర్‌తో ఉండలేక కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లోకి వెళ్లిపోయాడు. అలాంటి వారితో కిషన్ రెడ్డి సావాసం చేయడం విచిత్రం” అని రేవంత్ విమర్శించారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ద్వారా నిజమైన అభివృద్ధి జరుగుతుందని రేవంత్ స్పష్టం చేశారు. “ జూబ్లిహిల్స్ గెలవాల్సిందే, అభివృద్ధి కొనసాగించాల్సిందే ” అని ఆయన పిలుపునిచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి