- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలి ప‌ట్ల‌ పార్టీ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి రేపుతున్నాయి. పార్టీ నిబద్ధ కార్యకర్తలు, గత ఐదేళ్లుగా జగన్ నాయకత్వాన్ని మద్దతుగా నిలబెట్టుకున్న వారు కూడా ఇప్పుడు సజ్జల ఆధిపత్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ జగన్ లీడర్‌షిప్ కావాలి కానీ సజ్జల సూపర్ విజన్ వద్దు ” అనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఆయన తీరువల్లే వచ్చాయని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇటీవల కూడా వైసీపీ మీడియా వ్యవస్థ మొత్తం సజ్జల నియంత్రణలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెలివిజన్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఆయన అనుచరుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో, విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు సైలెంట్ అవ్వాల్సి వస్తోంది.


అయినా కొంతమంది మాత్రం బహిరంగంగానే విమర్శలను కొనసాగిస్తున్నారు. ఇటీవల సజ్జల పార్టీ కార్యకలాపాలపై నేరుగా సూచనలు ఇవ్వడం, కార్యాచరణ ప్లాన్‌లను రూపొందించడం కూడా వివాదంగా మారింది. ఆయన చెప్పిన పాయింట్లను వైసీపీ సోషల్ మీడియా టీమ్ పోస్టర్లుగా తయారుచేసి కార్యకర్తలకు పంపడం, వాటిలో జగన్ ఫోటో లేకపోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. “ జగన్ ఫోటో లేకుండా వైసీపీ ప్రచారం ? ” అనే ప్రశ్నను అనేక మంది సీనియర్ నేతలు, లోయల్ వర్కర్లు నేరుగా లేవనెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో సజ్జలకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వారిని పూర్తిగా పక్కన పెడుతున్నారని సమాచారం. బదులుగా సజ్జల వర్గానికి దగ్గరగా ఉన్న వారికే అవకాశాలు, ప్రచారం, సమన్వయ బాధ్యతలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


ఇక సజ్జలకు ప్రతిస్పందించే స్థాయిలో నాయకుడు పార్టీ లోపల లేడని భావన ఉంది. విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేతల్ని కూడా ఆయన వ్యూహాత్మకంగా పక్కకు నెట్టేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా ప్రస్తుతం పార్టీ లోపల విభేదాలు మరింత ముదురుతున్నాయి. కొంతమంది నాయకులు, ముఖ్యంగా అసలు పార్టీని స్థాపన దశలో నుంచి తీసుకువచ్చిన వర్కర్లు, ఇప్పుడు తిరుగుబాటుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. జగన్ ఈ అంతర్గత పరిస్థితులను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని, ఆయన చుట్టూ ఏర్పడిన సర్కిల్ అన్ని విషయాలను ఫిల్టర్ చేస్తోంద‌న్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారం కొనసాగితే పార్టీ మానసికంగా, వ్యవస్థాపకంగా మరింత దెబ్బతింటుందనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: