ప్రముఖ రచయిత అందెశ్రీ ఈరోజు ఉదయం 7:25 నిమిషాలకు కన్నుమూశారు. ఉదయం ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అందెశ్రీ 1961 జులై 18వ తేదీన సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన బాల్యం కూడా చాలా కష్టాలతో గడిచింది.ఎన్నో ఏళ్లపాటు అనాధగా కూడా పెరిగారు. తన తల్లిదండ్రులు ఎవరు? సొంత ఊరు ఎక్కడ తెలియని పరిస్థితులలో పెరిగారు.


జీవనం కోసం కొన్నేళ్లపాటు గొర్రెల కాపరిగా కూడా పనిచేశారు అందెశ్రీ. ఇక అక్కడ నుంచి ఆయన కవిత్వాన్ని ప్రారంభించి ఎలాంటి చదువులు చదవకపోయినా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఏకంగా గౌరవ డాక్టరేట్ ను పొందారు. అందెశ్రీ తన స్వీయ కృషి పట్టుదలతోనే తెలుగు సాహిత్యం పైన మంచి పట్టు సాధించారు.అందెశ్రీకి మొట్టమొదటిసారిగా గుర్తింపు తెచ్చినటువంటి పాట (మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు) ఆయన మొదటిసారి స్టేజి మీద కూడా పాడింది ఈ పాటేనట.



అందెశ్రీ తన కవిత్వాన్ని పాటలను ఆలపించేటప్పుడు ప్రత్యేకించి మరి ఒక మేనరిజాన్ని ప్రదర్శించేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఈయన రాసిన పాట జయ జయహే తెలంగాణ అనే గేయం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఈ పాటని తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా కూడా ఎంపిక చేయడం జరిగింది. 2006లో విడుదలైన గంగ సినిమాలోని పాటకు ఉత్తమ గీత రచయితగా కూడా నంది అవార్డుని అందుకున్నారు. అందెశ్రీ రాసేటువంటి పాటలు ఎంతో లోతైన భావాలు కలిగించేవి. ఎన్నో చిత్రాలలో పాటలు పాడిన అందెశ్రీ జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకున్నారు. ఈయనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన సేవలకు గాని ఏకంగా కోటి రూపాయలు నగదును అందించారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు,కుమారుడు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: