బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. ప్రారంభం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫలితాలు స్పష్టంగా ఎన్డీయే కూటమి వైపే మొగ్గుచూపుతున్నాయని లెక్కింపు ధోరణులు తెలియజేస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రజల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ప్రచారంలో పార్టీలు చేసిన హామీలు, వివిధ కూటముల వ్యూహాలు— ఇవన్నింటికీ ముగింపు పలుకుతూ ఓటర్ల తీర్పు ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిన ఎన్డీయే కూటమి మరోసారి బీహార్ ప్రజల విశ్వాసాన్ని అందుకున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ గడువు 122 స్థానాలను ఎన్డీయే ఇప్పటికే అధిగమించగా, మరెన్నో స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఫలితాలు ప్రకటించబడుతున్న కొద్దీ ఎన్డీయే నేతల్లో ఉత్సాహం కనిపిస్తున్నా, మహాఘట్బంధన్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.


తమ కూటమి ఈసారి విజయానికి ఖచ్చితంగా చేరుకుంటుందని భావించిన కాంగ్రెస్‌–ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్బంధన్‌కు మాత్రం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే దూకుడుకు సమీపంలోకైనా రాలేకపోవడం ప్రతిపక్ష శిబిరానికి పెద్ద షాక్‌గా మారింది. కౌంటింగ్ ట్రెండ్స్ స్పష్టత చెందుతున్న కొద్దీ ఈ నిరాశ ఆగ్రహంగా మారింది.ఈ నేపథ్యంలో కౌంటింగ్ హాల్స్ దగ్గర, పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. "ఓటర్ల తీర్పును వక్రీకరించారు", "ఓట్లను దొంగిలించారు" అన్న ఆరోపణలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగలేదని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు వారు ఆరోపించారు.



కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సుమారు 65 లక్షల ఓట్లను, అందులో ఎక్కువ భాగం ప్రతిపక్షానికి అనుకూలమైన ఓట్లేనని, వాటిని ఎస్ఐఆర్  పేరుతో తొలగించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఎండీయే కి పడిన ఓట్లు దొంగ ఓట్లు అని..అవి చెల్లవు అని..ఇంత భారీ స్థాయిలో ఓట్లు జాబితా నుండి తొలగించబడిన తర్వాత, కౌంటింగ్ రోజున ప్రభంజనం ఆశించడం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. "మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే, ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యం అవుతుంది?" అని ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. ప్రతిపక్షం ఈ ఆరోపణలను మరింతగా ప్రచారం చేస్తోంది. మరోవైపు, ఎన్డీయే నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఆధారరహితమైనవిగా కొట్టిపారేస్తున్నారు. అంతా కలిసి బీహార్ రాజకీయాల్లో మరోసారి విశేష ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఓట్ల లెక్కింపు పూర్తి అవుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: