జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఈ ఉపఎన్నిక తీర్పును బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా గౌరవిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన జూబ్లీహిల్స్‌ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల ప్రచారంలో చివరి దశలో చోటుచేసుకున్న పరిణామాలు ఫలితాలపై ప్రభావం చూపిన అంశం అందరికీ తెలిసినదేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చివరి వరకూ ధైర్యంగా, నిస్సహాయ పరిస్థితుల్లోనూ దృఢంగా పోరాడిందని ఆయన ప్రశంసించారు. రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ సునీత ప్రదర్శించిన ప్రతిభ, పట్టుదల, ప్రజలతో కలిసిపోవడంలో చూపిన నిబద్ధత ప్రశంసనీయం అని కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా వెలువడిన పలు సర్వేల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పిన కేటీఆర్, “అయితే ఎన్నికల చివరి మూడు రోజుల్లో జరిగిన పరిణామాలు మొత్తం రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేశాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా స్పష్టంగా గమనించారు” అని అన్నారు. ఈ ఉపఎన్నిక ఫలితాలు తమను నిరుత్సాహపరచలేవని, వాస్తవానికి పార్టీ కేడర్‌కు మరింత ఉత్సాహం, ప్రేరణను అందించాయని చెప్పారు.“తాము ఆశించిన ఫలితం రాలేదని అంగీకరిస్తున్నాం. కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఎప్పుడూ ఒక ఎన్నిక ఫలితంతో కుంగిపోయే పార్టీ కాదు. ప్రతిపక్షపాత్రలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం మరింత బలంగా కొనసాగిస్తాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు. మాగంటి సునీత ప్రదర్శన గులాబీ సైన్యానికి గర్వకారణంగా నిలిచిందని ఆయన అభినందించారు.

అంతేకాకుండా, “బైపోల్స్‌లో మేము నిజాయతీతోనే పోరాడాం. ఎలాంటి అక్రమ ప్రవర్తనకు పాల్పడలేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం అన్ని రకాల అవాంఛనీయ చర్యలకు పాల్పడింది. ప్రభుత్వంలోని కొందరు నేతలు అసభ్యంగా మాట్లాడినా మేము సంయమనం పాటించాం. ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్–బీజేపీ మధ్య జరిగిన అప్రకటిత సఖ్యత అందరికీ స్పష్టంగా కనబడింది” అని కేటీఆర్ విమర్శించారు.ఉపఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్‌నే అన్న విషయాన్ని మళ్లీ రుజువు చేశాయని ఆయన అన్నారు. “గోడకు కొట్టిన బంతిలా బీఆర్ఎస్ మరింత శక్తివంతంగా తిరిగి వస్తుంది. కేడర్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. 2014 నుండి 2023 మధ్య జరిగిన ఏడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కటైనా గెలవలేదు. కానీ 2023 సాధారణ ఎన్నికల్లో మాత్రం పరిస్థితులు మారాయి. అదే విధంగా మేము కూడా తిరిగి లేస్తాం” అని కేటీఆర్ ధైర్యంగా పేర్కొన్నారు.

బిహార్‌ ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ అక్కడ పూర్తిగా నిలబడలేకపోయిందని ఎద్దేవా చేశారు. “మేము ఓడినా ధైర్యంగా, నిజాయతీగా మాట్లాడుతున్నాము. అందుకే ప్రజలు మా మాటలను గౌరవిస్తున్నారు” అని కేటీఆర్ అన్నారు. ఆయన మాట్లాడిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, సమయస్పూర్తి ప్రజల్లో మంచి సానుభూతిని రేకెత్తించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: