జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వర్షెన్ వినిపించారు. ఈ ఉపఎన్నిక తీర్పును బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా గౌరవిస్తోందని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చివరి వరకూ ధైర్యంగా, దృఢంగా పోరాటం చేసిందని ప్రశంసించారు. రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ సునీత ప్రతిభతో, పట్టుదలతో తన స్థానాన్ని నిలబెట్టుకుందని ఆయన అభినందించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అనేక సర్వేల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారనీ, అయితే ఎన్నికల చివరి మూడు రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిన విషయమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ ఉపఎన్నిక ద్వారా కాంగ్రెస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్‌నే అన్న విషయం మరోసారి రుజువైందని అన్నారు. ఈ ఫలితం తమకు మరింత ఉత్సాహం, ప్రేరణను ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తాము ఆశించిన ఫలితం రాలేదని అంగీకరించినప్పటికీ పార్టీ తీవ్రంగా నిరుత్సాహానికి లోనుకాలేదని పేర్కొన్నారు.

ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్‌కు 38 శాతం కంటే ఎక్కువ ఓట్లు రావడం ఆనందదాయకమని వివరించారు. డిపాజిట్‌ కూడా కాపాడుకోలేకపోయిన పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా, అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ నేతలు నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించారనీ, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరిచే చర్య అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎవరైన ఓడిపోతే కొన్నాళ్లు మీడియా కి ముఖం చూపించరు. కానీ కేటీఆర్ మాత్రం తనదైన స్టైల్ లో ముందుకు వెళ్లడం అందరిని మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: