జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఓటమిని కేటీఆర్ చిన్న సెట్‌బ్యాక్‌గా పేర్కొంటూ, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. “రాజకీయాల్లో గెలుపు–ఓటములు సహజం. ముందుకు సాగాలి. కార్యకర్తలు మళ్లీ సన్నద్ధం కావాలి. మరింత బలంగా పని చేద్దాం. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఆగకుండా శ్రమిద్దాం” అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అయన మాట్లాడుతూ గత ఎన్నికల నేపథ్యాన్ని గుర్తు చేశారు. “2014 నుంచి 2023 వరకు మొత్తం ఏడు ఉపఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉపఎన్నికలో కూడా గెలవలేదు. అయితే మేము ఐదు ఉపఎన్నికల్లో విజయం సాధించాం. రెండు చోట్ల మాత్రమే ఓడిపోయాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి–రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రమే వచ్చాయి” అని వివరించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఎంతో సజావుగా, నిబద్ధతతో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. “ఈ ఎన్నికల్లో ప్రజల తరఫున వాదనను గట్టి స్థాయిలో వినిపించాం. ప్రజా సమస్యలను, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. కుల–మత రాజకీయాలు చేయలేదు. అసభ్య పదజాలం ఉపయోగించలేదు. చాలా హుందాగా, నైతికంగా పోరాటం చేశాం. ప్రజలకు అవసరమైన విషయాలనే చర్చకు తీసుకువచ్చాం. కాంగ్రెస్, భాజపా ఎన్నిమార్లు కవ్వించే ప్రయత్నం చేసినా, మేము పూర్తిగా సంయమనంతో వ్యవహరించాం” అని కేటీఆర్ చెప్పారు.

జూబ్లీహిల్స్ ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా ఆయన గుర్తుచేశారు. “పదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన బాధ్యతాయుత పార్టీగా జూబ్లీహిల్స్ కోసం భారీ పనులు చేశాం. రూ.5 వేలు కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంత పెద్ద మొత్తంలో పనులు చేసినప్పుడు, ప్రజల కోసం ఎంత కట్టుబడి పనిచేశామో స్పష్టంగా కనిపిస్తుంది” అని వివరించారు.కేటీఆర్ చివరగా కార్యకర్తలను ఉద్దేశించి భవిష్యత్తులో మరింత శక్తివంతమైన పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. “కొన్ని ఓటములు మన పయనాన్ని ఆపలేవు. ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు సాగాలి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి బలంగా నిలబడేలా ప్రతీ ఒక్కరూ కష్టపడాలి” అని సందేశం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: