విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ రాజకీయాల్లో వేడి చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీటు కేటాయింపుపై పార్టీ శ్రేణుల్లో రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పక్కనపెట్టబడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మళ్లీ ఈ నియోజకవర్గ పగ్గాలు అప్పగించాలని అనేక మంది కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో వంగవీటి ఆశ కిరణ్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు సెంట్రల్ సీటు చుట్టూ మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.మల్లాది విష్ణు అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయనకు అనుకూలంగా భారీ స్థాయిలో పోస్టర్లు, వీడియోలు, సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో నియోజకవర్గాల మార్పుల‌ నేపథ్యంలో మల్లాది విష్ణుకు టికెట్ దక్కలేదు.


అప్పట్లో జగన్ ఆయన్ను ఓదారుస్తూ “ మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి పరిశీలిస్తాం ” అని హామీ ఇచ్చారన్న మాట ప్రచారంలో కనిపించింది. దీంతో మల్లాది విష్ణు ఎటువంటి బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవించారు. విష్ణు స్థానంలో పశ్చిమ నియోజకవర్గ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సెంట్రల్ నుంచి బరిలోకి దింపిన వైసీపీ బిగ్ రాంగ్ స్టెప్ వేసి అందుకు తీవ్ర ప్ర‌తికూల‌త ఎదుర్కొంది. వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోగా, ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ప్రస్తుతం మల్లాది విష్ణు మళ్లీ క్రియాశీలకంగా మారి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ, బూత్ స్థాయిలో మద్దతు కూడ‌గ‌ట్టు కుంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, అధిష్ఠానంతోనూ సన్నిహితంగా ఉన్నారు. దీంతో సెంట్రల్ సీటు విష్ణుకే దక్కే అవకాశం బలంగా కనిపిస్తున్నదని ఆయన వర్గం నమ్మకం వ్యక్తం చేస్తోంది.


అయితే, మరో వైపు వంగవీటి ఆశ కిరణ్ ప్రవేశం కొత్త చర్చకు నాంది పలికింది. వంగవీటి కుటుంబానికి విజయవాడలో ఉన్న ప్రభావం వేరే చెప్పనవసరం లేదు. ఆశ కిరణ్ ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా స్పష్టత లేకపోయినా, వైసీపీ శ్రేణుల్లో “ఆమెకే సెంట్రల్ టికెట్ రిజర్వ్ చేశారట” అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఆమె వైసీపీలో చేరితే పార్టీ సెంట్రల్ సీటు కేటాయించే అవకాశముందని కొందరు నేతలు చెప్పుకుంటున్నారంటే అది గమనించదగిన అంశంగా మారింది. పార్టీ అధికార వర్గాలు మాత్రం—“ఇప్పుడే టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం లేదు. ఎన్నికలు దగ్గర పడిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాం” అని క్లారిటీ ఇస్తున్నాయి. అయినా మల్లాది విష్ణు, ఆశా కిరణ్ పేర్లు సెంట్రల్ నియోజకవర్గంలో చర్చకు వస్తూనే ఉన్నాయి. ఫైన‌ల్ గా వచ్చే ఎన్నికల నాటికి సెంట్రల్ నియోజకవర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, పార్టీ అధిష్ఠానం ఎవరిపై నమ్మకం ఉంచుతుందో ?అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: