ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం (టీడీపీ), జనసేన కూటమిలో ఎన్నికల వ్యూహాలు వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగా, కొన్ని కీలక నియోజకవర్గాల్లో పార్టీల మధ్య మార్పిడి జరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ ఈసారి తన సిట్టింగ్ స్థానాన్ని మార్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయన సొంత ప్రాంతం రాజమండ్రి కావడంతో, వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం ఊపందుకుంది.


గోరంట్ల బుచ్చయ్య చౌదరి రిటైర్మెంట్?..రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే ఇది తనకు చివరి ఎన్నిక అని బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం లేదు. సీనియర్లను క్రమంగా పక్కన పెడుతున్న టీడీపీ అధినాయకత్వం ఈసారి బుచ్చయ్య చౌదరికి టిక్కెట్ ఇవ్వకుండా, ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి పెద్దల సభకు పంపుతారని భావిస్తున్నారు.



నియోజకవర్గాల మార్పిడి వ్యూహం.. ఈ పరిణామాల నేపథ్యంలో, టీడీపీ వ్యూహాత్మకంగా నియోజకవర్గాలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్‌ను జనసేనకు కేటాయింపు: బుచ్చయ్య చౌదరి రిటైర్మెంట్ దృష్ట్యా, రాజమండ్రి రూరల్‌ను జనసేనకు కేటాయించి, అక్కడి నుంచి కందుల దుర్గేష్‌ను పోటీ చేయించడం ఖాయమని చెబుతున్నారు. నిడదవోలును టీడీపీకి కేటాయింపు: నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన నిడదవోలు, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన బలమైన స్థానం. ఇక్కడ టీడీపీ కేడర్ నుంచి కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంది. అందుకే నిడదవోలును తిరిగి టీడీపీ అభ్యర్థికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



కందుల దుర్గేష్ ప్రస్తుతం పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువ సమయం రాజమండ్రిలోనే గడుపుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని జనసేన నాయకులు, క్యాడర్‌తో నిరంతరం టచ్‌లో ఉండటం, అక్కడ పర్యటిస్తూ తాను వచ్చేస్తున్నాననే సంకేతాలను ఇవ్వడం ఈ మార్పిడిని ధృవీకరిస్తోంది.మొత్తం మీద, ఈ 'ఎక్స్ఛేంజ్ మేళా' ద్వారా రెండు పార్టీలు పరస్పరం సీట్లను మార్పిడి చేసుకుని, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ మార్పు కూటమి విజయానికి ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: