ఘోర ఓటమిని కప్పిపుచ్చే ప్రయత్నం.. జన్ సురాజ్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోగా, మెజారిటీ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయితే, ఈ ఓటమి బాధాకరంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తన ప్రచారం బలంగా ఉందని పీకే చెప్పుకొచ్చారు. నెలల తరబడి తన బృందం సేకరించిన అభిప్రాయాలతో ఓటింగ్ ట్రెండ్లు సరిపోలడం లేదని, అందుకే 'ఎక్కడో తప్పు జరిగింది' అని తాను నమ్ముతున్నానంటూ సన్నాయినొక్కులు నొక్కారు. రూ.10 వేల పంపిణీ వ్యూహం..తన ఓటమికి పీకే ఆపాదించిన మరో కారణం... ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఓటింగ్ రోజు వరకూ రాష్ట్రంలో మహిళలకు పదివేల రూపాయలు అందజేశారని ఆరోపించడం. వాస్తవానికి మహిళలకు మొత్తం రూ. రెండు లక్షలు అందుతాయని, మొదటి విడతగా రూ.10వేలు ఇచ్చారని, ఎన్డీయే లేదా నితీశ్ కు ఓటు వేస్తేనే మిగిలిన మొత్తం లభిస్తుందని మహిళలు భావించారని పీకే చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, ప్రచారం చివరి దశలో చాలా మంది ఓటర్లు జన్ సురాజ్ గెలిచే స్థితిలో లేదని భావించారని, అందుకే అది లాలూ ప్రసాద్ 'జంగిల్ రాజ్యం' తిరిగి రావడానికి మార్గం సుగమం చేస్తుందని భయంతో కొంతమంది ఓటర్లు దూరం అయ్యారని కూడా పీకే తనదైన విశ్లేషణ చేశారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పలు పార్టీల విజయాల్లో తన పాత్ర కీలకమని చెప్పుకునే పీకే, తన సొంత పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు ఇతరులపైకి నెట్టడం సరికాదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యూట్యూబ్‌లో పాటలు, పోస్టర్లు, సర్వేలు చేసి ఎన్నికల వ్యూహం అని చెప్పుకోవడం సులువే కానీ, ప్రజాక్షేత్రంలోకి దిగి, ప్రజల నాడి పట్టుకోవడమే అసలైన రాజకీయం అని పీకే కనీసం వచ్చే ఎన్నికలనాటికైనా తెలుసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి