- ( ఉత్త‌రాంధ్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ )

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గ‌త కొద్ది నెలలుగా కొనసాగుతున్న అలక పాన్పు మీద ఉన్నార‌ని.. అయితే ఇప్పుడు ఆ అల‌క కాస్త త‌గ్గింద‌న్న మాట విశాఖ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి ఘ‌న‌ విజయం సాధించిన గంటా, మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే ర‌క‌ర‌కాల రాజకీయ సమీకరణాల వల్ల లేదా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌తో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేదు. గంటా ఇమేజ్, సీనియార్టీకి తగ్గ విధంగా పదవి రాకపోవడం గంటాలో అసంతృప్తిని పెంచింది. ఇదే కాకుండా, స్థానికంగా కొన్ని వివాదాలు, కూటమిలోని మరో పార్టీ నేతతో జరిగిన విభేదాలు గంటాకు తీవ్ర ఒత్తిడిని తెచ్చాయి. ఆ నేత చేసిన ఫిర్యాదులు, వాటిపై తనకు ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడం వల్ల గంటా రాజకీయంగా ఒంటరైపోయినట్లే భావన ఏర్పడింది. దీంతో ఆయ‌న కొంతకాలం మౌనం పాటించారు. రాజకీయంగా దూరంగా నిలబడినట్లుగా కనిపించారు.


ఇప్పుడు ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యింది. గూగుల్ డేటా సెంటర్‌ను ఏపీకి తీసుకురావాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంగా, ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణలో పెద్ద సవాలు ఎదురైంది. విశాఖలో ఇప్పటికే పరిశ్రమలు విస్తారంగా ఉండటం, డేటా సెంటర్ కోసం 588 ఎకరాలు సమకూర్చాల్సి రావడం వల్ల ప్రభుత్వానికి ఛాలెంజింగ్‌గా మారింది. ఈ కీలక సమయంలో గంటా ముందుకు వచ్చి, భీమిలి పరిధిలోని రెండు ప్రాంతాల్లో 160 ఎకరాలు చొప్పున మొత్తం 320 ఎకరాలను ప్రభుత్వానికి అందుబాటులోకి తెచ్చేందుకు ముందడుగు వేశారు.
గంటా వ్యక్తిగతంగా రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, నష్టపరిహారం, భవిష్యత్ అవకాశాలపై స్పష్టత ఇచ్చారు. రైతులు గంటా మాట నమ్మి భూములు ఇవ్వడానికి అంగీకరించారు.


ప్రభుత్వం కూడా వెంటనే వారికి ప్యాకేజీలు, పర్యవేక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ మొత్తం వ్యవహారంలో గంటా చూపిన చొరవ, నాయకత్వం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించింది. దీంతో చంద్రబాబు స్వయంగా గంటాను అభినందించడంతో పాటు త్వరలోనే కలుసుకుంటానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో గంటా గత కొద్దికాలం పాటు ఉన్న అసంతృప్తి పూర్తిగా తగ్గిపోయిందని సమాచారం. “బాబు నన్ను పట్టించుకోవడం లేదు” అనే వాదన చెరిగిపోయింది. తిరిగి గంటా రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ఇదే కీలక మలుపు అయినట్టుగా భావిస్తున్నారు. భీమిలి, విశాఖ రాజ‌కీయాల్లో వచ్చే రోజుల్లో గంటా ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: