ఆంధ్రప్రదేశ్‌లో '22ఏ' జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల వ్యవహారం వేలాది మంది రైతులకు, ప్రజలకు గత కొన్నేళ్లుగా తలనొప్పిగా మారింది. ఈ నిషేధిత జాబితా కారణంగా రైతులు తమ భూములను అమ్మడం గానీ, కొనడం గానీ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, ఏలూరు జిల్లాలో ఈ భూముల సమస్యలకు కీలక పరిష్కారం లభించింది. ఏళ్ల తరబడి వెంటాడుతున్న ఈ సమస్యను ప్రభుత్వం ఒక్క రోజులోనే పరిష్కరించి 'మాస్ రిలీఫ్' ఇచ్చింది! మంత్రి, ఎమ్మెల్యేల 'స్పాట్' యాక్షన్! ఏలూరు జిల్లా కలెక్టరేట్‌కు అన్ని మండలాల రెవెన్యూ అధికారులు, బాధితులను పిలిపించి ... అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు మెగా గ్రీవెన్స్ సెల్‌ను నిర్వహించారు.
 

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. బాధితులతో మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ సహా అధికారులు ఏకంగా 809 వినతులను స్వీకరించారు. అధికారులు రికార్డుల్ని పరిశీలించి, చాలామంది సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించారు. తాము ఎన్నో ఏళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాని తమ భూముల సమస్యలు... ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో ఒక్క రోజులోనే పరిష్కారం కావడంతో బాధితులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలకూ 'ఏలూరు ఫార్ములా! ఏలూరు జిల్లాలో సమస్యల పరిష్కారానికి దాదాపు నెల రోజులుగా కసరత్తు చేశారు.

 

ఈ 'ఏలూరు ఫార్ములా ను రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అనుసరించి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రెండు వారాల్లో రెవెన్యూ, దేవదాయ, రిజిస్ర్టేషన్‌ శాఖల ఆధ్వర్యంలో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించాలన్నారు. దర్జాగా అమ్మేయొచ్చు! నిషేధిత '22ఏ' జాబితా నుంచి సర్వే నంబర్లు తొలగించారా లేదా అనేది ఇకపై ప్రజలు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని మంత్రి మనోహర్ తెలిపారు. ఎంతో సుదీర్ఘకాలం తర్వాత ఈ భూముల సమస్యలు పరిష్కారం కావడంతో... ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోయిన వారు దర్జాగా ఆ భూముల్ని అమ్ముకోవచ్చు, లేదా ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. ప్రతినెలా గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించడం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: