దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉన్న అన్నదమ్ములు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మళ్లీ ఒక్కటయ్యారు. ఈ కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 2026 ముంబై మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.బుధవారం ముంబైలోని శివాజీ పార్క్ సమీపంలో ఉన్న శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే స్మారక చిహ్నం వద్ద ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే కారులో రాజ్ థాకరే ఇంటి నుంచి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కేవలం ఒక కుటుంబ సమావేశం మాత్రమే కాకుండా, రాబోయే రాజకీయ మార్పులకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అపార్థాల కారణంగా విడిపోయిన ఈ కుటుంబం మళ్లీ కలవడం మరాఠీ ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రత్యేకంగా ఏక్‌నాథ్ షిండే వర్గంతో తీవ్రంగా పోరాడుతున్న ఉద్ధవ్ థాకరేకు, తమ్ముడు రాజ్ థాకరే మద్దతు లభించడం ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉద్ధవ్ థాకరే రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తేనే శివసేన అసలైన వారసుడు ఎవరు అన్న విషయం ప్రజల్లో స్పష్టతకు వస్తుంది.



మరాఠీ మనుషుల హక్కుల కోసం, ముంబై ఆత్మగౌరవం కోసం తామంతా ఒక్కటయ్యామని ఈ ఇద్దరు నాయకులు ప్రకటించారు. కులమతాలకు అతీతంగా ముంబై ప్రజలందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని శివసేన నాయకులు పేర్కొన్నారు. విడిపోయి పోరాడితే అది ఇక్కడి అమరవీరులకు చేసే అవమానమని కూడా వారు స్పష్టం చేశారు.రాజ్ థాకరే తన ప్రసంగంలో ఐక్యతను బలంగా చాటారు. వ్యక్తిగత అపార్థాల కన్నా మహారాష్ట్ర గౌరవమే ముఖ్యమని అన్నారు. సీట్ల పంచకాలు కన్నా ముంబై ప్రయోజనాలే తమకు ప్రాధాన్యత అని, నాసిక్ వంటి ఇతర కార్పొరేషన్లలో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ పొత్తు ద్వారా ముంబై పీఠాన్ని తప్పకుండా దక్కించుకుంటామని రాజ్ థాకరే ధీమా వ్యక్తం చేశారు.



అయితే ఈ రాజకీయ పొత్తు ద్వారా నిజంగా లాభం ఎవరికీ? నష్టం ఎవరికీ? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ కలయిక వల్ల లాభం నేరుగా ముంబై ప్రజలకు చేరుతుందా? లేక ఈ ఇద్దరు సోదరులకు, వారిని నమ్ముకున్న నాయకులకు మాత్రమే పరిమితమవుతుందా? అన్న సందేహాలు ఉన్నాయి.మరోవైపు, ఈ పొత్తు వల్ల షిండే వర్గానికి, అలాగే మహారాష్ట్రలోని ఇతర రాజకీయ పార్టీలకు ఇది పెద్ద సవాల్‌గా మారనుంది. మరాఠీ ఓటు బ్యాంక్ మళ్లీ ఒకే చోట చేరితే, రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.



మొత్తంగా చూస్తే, ధాకరే బ్రదర్స్ కలయిక కేవలం ఒక కుటుంబ పునర్మిళనం మాత్రమే కాదు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు. దీని ఫలితం ముంబై మున్సిపల్ ఎన్నికలతో పాటు, రాష్ట్ర రాజకీయాల దిశను కూడా నిర్ణయించనుంది. ఈ పొత్తు ద్వారా ఎవరు గెలుస్తారు, ఎవరు నష్టపోతారు అన్నది కాలమే తేల్చాలి. కానీ ఇప్పటికైతే, ఈ కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: