కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా పన్నెండేళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. మూడు సార్లు ప్రధాని పదవికి ప్రమాణ స్వీకారం చేసి, కాంగ్రెస్ేతర ప్రధానుల్లో మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. మొదట్లో మోడీని, బీజేపీని లైట్‌గా తీసుకున్న కాంగ్రెస్‌కు 2019 ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. మూడు వందలకు పైగా ఎంపీలతో బీజేపీ రెండోసారి సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడం దేశ రాజకీయాలనే తలకిందులు చేసింది. ఇక 2024 ఎన్నికల్లో సొంత మెజారిటీ కొంత తగ్గినా, మిత్రపక్షాల మద్దతుతో మోడీ మళ్లీ అధికారం చేపట్టారు. అప్పటికి కానీ కాంగ్రెస్‌కు మోడీ విషయంలో సీరియస్‌గా ఉండాల్సిన అవసరం అర్థం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై ఎంత దూకుడుగా పోరాటం చేస్తున్నా, కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదు.

 
రాహుల్ ప్రచారం చేసిన చోట్ల కాంగ్రెస్ పరాజయాలు ఎదుర్కోవడం, మిత్రపక్షాలను కూడా ఓటమి బాట పట్టించడం ఇండియా కూటమిలో పెద్ద చర్చగా మారింది. ఈ పరిస్థితుల్లో 2026నే కాంగ్రెస్‌కు చావో రేవో అన్నట్లుగా కీలక రాజకీయ వేదికగా మారుతోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోతైన చర్చ జరిగిందని సమాచారం. ప్రజల మధ్య నిలబడి, ప్రజాసెంటిమెంట్‌ను ఆయుధంగా చేసుకొని మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే వ్యూహంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 2026లో జరగనున్న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు ‘గాంధీ సెంటిమెంట్’ను గట్టిగా వినియోగించాలనే నిర్ణయానికి వచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. ఈ పథకాన్ని మెల్లగా ఎత్తివేసే ప్రయత్నమే జరుగుతోందన్న ఆరోపణలను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కొత్త ఏడాది నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.



ఈ పథకం యూపీఏ-1 హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. 2006 ఫిబ్రవరి 2న ఏపీ అనంతపురం జిల్లా బండ్లపల్లిలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కలిసి ప్రారంభించారు. ఇరవై ఏళ్లు పూర్తవుతున్న వేళ అదే బండ్లపల్లి నుంచి పోరు ప్రారంభిస్తే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందన్న అంచనాతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. సోనియా గాంధీని బండ్లపల్లికి ఆహ్వానించామని ఏపీసీసీ మాజీ చీఫ్ రుద్రరాజు చెప్పడం రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతోంది. సోనియా వస్తే జాతీయ సెంటిమెంట్‌తో పాటు ప్రాంతీయ సెంటిమెంట్ కూడా కాంగ్రెస్‌కు కలిసొస్తుందన్న ఆశతో పార్టీ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: