’నన్ను కాపు సామాజకవర్గానికి మాత్రమే పరిమితం చేయొద్దు’

’కాపులను నమ్ముకుని నేను జనసేన పార్టీని పెట్టలేదు’

 

ఇవి....ఒకపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. మరిపుడు ఏమొచ్చింది కాపుల సంక్షేమం కేంద్రంగా రాజకీయాలు మొదలుపెట్టాడు ? మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం+రెండు నియోజకవర్గాల్లో ఓటమితో పవన్  ’కాపు రాజకీయం’ మొదలుపెట్టినట్లే ఉన్నాడు. అందుకనే కాపు సామాజికవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసేస్తున్నట్లు గోల మొదలుపెట్టాడు. ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ప్రెస్ నోట్ చూస్తే పవన్ రాజకీయం ఏమిటో అర్ధమైపోతుంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కాపునేస్తం పథకంలో భాగంగా ప్రభుత్వం 2.3 లక్షల మందికి రూ. 357 కోట్లు విడుదల చేయటాన్ని పవన్ తప్పు పడుతున్నట్లున్నాడు. ఏడాదికి కాపుల సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసిందో చెప్పాలంటూ విచిత్రమైన డిమాండ్ చేశాడు. కాపు కార్పొరేషన్ కు వైసిపి ప్రభుత్వం ఎంత కేటాయించింది ? ఎంత ఖర్చు చేసింది ? అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలట. కాపుల సంక్షేమంపై శ్వేతపత్రం  అడగాలనే ఆలోచన పవన్ కు ఇపుడే  గుర్తుకొచ్చినట్లుంది. చంద్రబాబునాయుడు హయాంలో కాపుల సంక్షేమం గురించి అసలు ఆలోచనే రాలేదు పాపం.

 

పైగా రిజర్వేషన్ గురించి కాపులు అడగకుండా  ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించటమే విచిత్రంగా ఉంది. కాపు రిజర్వేషన్లకు జగన్ కు ఏమీ సంబంధం లేదన్న విషయం పవన్ మరచిపోయినట్లున్నాడు. కాపులు రిజర్వేషన్ కావాలని తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం బహిరంగ  సభలో డిమాండ్ చేస్తే ధైర్యంగా కుదరదని జగన్ చెప్పిన విషయం పవన్ తెలీదేమో. తన పరిధిలో లేని రిజర్వేషన్ అంశంపై తాను హామీ ఇవ్వనని జగన్ స్పష్టంగా చెప్పాడు.  హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును నిలదీయకుండా జగన్ మీద ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

కులాల మధ్య విధ్వేషాలు పెంచేలా ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందంటూ చెప్పటం కూడా అన్యాయమే. ఎక్కువ నిధులు కాపులకే కేటాయిస్తున్నట్లు చెప్పటం శ్రేయస్కరం కాదని పవన్ సలహా ఇచ్చాడు. కాపులకు ఎక్కువ నిధులు  కేటాయిస్తున్నట్లు చెప్పటం వల్ల కులాల మధ్య విధ్వేషాలు ఎలా మొదలవుతాయో పవనే చెప్పాలి. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాపు, బిసి, మైనారిటి, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కొత్తగా కాపులపై ఏ సామాజికవర్గానికి విధ్వేషం పెరగదని పవన్ గుర్తుంచుకోవాలి.

 

ఇక చివరగా కాపులకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే సంతోషించాలి కానీ ఎందుకు గోల చేస్తున్నాడు పవన్. భవిష్యత్తులో కాపు సామాజికవర్గం తనవైపు తిరిగి చూడరనే టెన్షన్ మొదలైందా ?  ఇక చంద్రబాబును కాపులు నమ్మరన్న విషయం పవన్ కు ఖాయంగా అర్ధమైపోయిందా ? అందుకేనా  కాపుజాతి పరిరక్షకునిగా పవన్ కొత్త రాజకీయాలు మొదలుపెడుతున్నది ? మొన్నటి ఎన్నికల్లోనే కాపులు పవన్ ఎంతగా నమ్మారు అనే విషయం తేలిపోయింది. కాబట్టి పవన్ కొత్తగా ఎన్ని రాజకీయాలు చేసినా కాపులు పవన్ నమ్మరు గాక నమ్మరంతే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: