
మిత్రపక్షం అని చెబుతునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ భలే దెబ్బ కొడుతోంది. ఎప్పటికప్పుడు ఏదో పేరు చెప్పి జనసేనను దెబ్బ కొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నుట్లుంది బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు చూస్తుంటే. తాజాగా ముఖ్యమంత్రి పదవిని బీజేపీ బీసీలకే కేటాయిస్తుందని చేసిన ప్రకటన కచ్చితంగా పవన్ కు షాకిచ్చేదేనటంలో సందేహం లేదు. ఎందుకంటే మిత్రపక్షాల సీఎం అభ్యర్ధిగా పవన్ను ప్రకటించాలని జనసేన నేతలు ఇఫ్పటికే బీజేపీ నేతలను కోరున్నారు. సీఎం అభ్యర్ధిగా పవన్ను ప్రకటిస్తేనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇస్తామంటూ ఇప్పటికే జనసేన నేతలు వీర్రాజుకు స్పష్టంగా చెప్పున్నారు.
మరి వీళ్ళ హెచ్చరికలు, డిమాండ్లు కంటిన్యు అవుతుండగానే ముఖ్యమంత్రిగా బీసీ నేతే ఉంటారని వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అప్పటికేదో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందన్నట్లుగానే ఉంది వీర్రాజు మాటలు. గెలుపు సంగతి తర్వాత అసలు బీజేపీ తరపున ఎంతమంది పోటీ చేస్తారో తెలీదు ? పోటీ చేసే వాళ్ళలో ఎంతమంది డిపాజిట్లు తెచ్చుకుంటారో కూడా ఎవరికీ తెలీదు. అలాంటిది కమలంపార్టీ అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు, ముఖ్యమంత్రి పదవిలో బీసీ నేత కూర్చోబోతున్నట్లు వీర్రాజు చెప్పటం క్యామిడి కాక మరేమిటి ?
సరే బీజేపీ యాంగిల్ ఎలాగున్నా ముఖ్యమంత్రి అభ్యర్ధి అనే పవన్ ఆశలపై వీర్రాజు నీళ్ళు చల్లేసింది మాత్రం వాస్తవం. వీర్రాజు మాటలను ఖండిస్తే ఒక సమస్య ఖండించకుండా మౌనంగా ఉంటే మరో సమస్య. ఖండిస్తేనేమో పవన్ బీసీలకు వ్యతిరేకమనే ప్రచారం మొదలవుతుంది. అలాగని వీర్రాజు ప్రకటనను ఖండించకపోతే మౌనం అర్ధాంగీకారం పద్దతిలో అంగీకరించినట్లవుతుంది. అంటే పవన్ను వీర్రాజు వ్యూహాత్మకంగా డిఫెన్స్ లోకి నెట్టేసినట్లే. మొత్తానికి పవన్ను బీజేపీ వాళ్ళు ఆటలో అరటిపండు పద్దతిలో ఉపయోగంచుకుంటున్నారనే విషయం అందరికీ అర్ధమైపోతోంది. మరి ఈ విషయం పవన్ కు అర్ధమవుతోందా ? లేకపోతే అర్ధమైకూడా అర్ధంకానట్లు నటిస్తున్నాడేమో.