బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే మూడు టెస్టులు ముగిసాయి. మొదటి టెస్టులో ఆసీస్, రెండో టెస్టులో భారత్ విజయం సాధించగా... సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెల్సిందే. కాగా ఈ మ్యాచ్ లో ఓటమి దిశగా సాగిన భారత్... ఐదో రోజు అద్భుతమైన ఆటతో ఆసీస్ కు చుక్కలు చూపించింది. సునాసయంగా గెలుస్తామని భావించిన ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని రోజంతా పరీక్షించింది. కాగా ఐదో రోజు ఆటలో యువ ఆటగాడు రిషబ్ పంత్, సీనియర్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారాతో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగా, చివరి సెషన్ లో హనుమ విహారి, రవి చంద్రన్ అశ్విన్ ల బ్యాటింగ్ ఆసీస్ విజయానికి బ్రేక్ వేసింది.  కాగా రిషబ్ పంత్ 97 (118)   ధనా ధన్ ఇన్నింగ్సే మ్యాచ్ ను ఆస్ట్రేలియా వైపు నుంచి లాగేసిందని చెప్పొచ్చు.

అయితే ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ అజింక్య రహనే వికెట్ కోల్పోయింది. అయితే రహనే వికెట్ అనంతరం హనుమ విహారి బ్యాటింగ్ కు రావాల్సి ఉండగా... కెప్టెన్ రహనే కీలక నిర్ణయం తీసుకున్నాడు. విహారి బదులు పంత్ ను బ్యాటింగ్ కు పంపాడు. దీంతో పంత్ వేగంగా ఆడుతూ భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పంత్ అటాకింగ్ బ్యాటింగ్ వల్ల ఓ సమయంలో మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తుందనే ఆశలు కూడా చిగురించాయి. అయితే కీలక సమయంలో పంత్,  పుజారా ఔటవడం, చేతిలో తగిన వికెట్లు లేకపోవడంతో భారత్ మ్యాచ్ ను డ్రా చేసే దిశగా పోరాటం చేసింది. ఇందుకు అనుగుణంగానే మరో వికెట్ పడకుండా విహారి, అశ్విన్ గొప్పగా ఆడి ఆసీస్ కు షాక్ ఇచ్చారు.

 కాగా ఈ ఇన్నింగ్స్ లో రహానే నాయకత్వ తీరు మరోసారి బయటపడింది.  విహారి కంటే ముందు పంత్ ను బ్యాటింగ్ కు పంపించాలనే వ్యూహమే భారత్ ను ఆసీస్  పై పైచేయి సాధించేలా చేసిందని చెప్పొచ్చు. కాగా బాక్సింగ్ డే టెస్టులో కూడా జట్టు కూర్పు, బౌలింగ్ లో మార్పుల లాంటి రహానే వ్యూహాలు భారత్ ను విజయపథంలో నడిపించాయి. దీంతో అప్పుడు కూడా రహానే కెప్టెన్సీపై సీనియర్లు ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: