టీ20 ప్రపంచకప్‌-2021లో పాకిస్తాన్‌తో జ‌రిగిన  మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజ‌యాన్ని మూట‌కట్టుకున్న విష‌యం విధిత‌మే. కొంత మంది త‌మ హ‌ద్దులు దాటి ఈ ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీనే కారణమంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.  3.5 ఓవ‌ర్ల‌లో 43 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న ష‌మీ ప్ర‌ద‌ర్శ‌న‌కు మ‌తాన్ని కూడ జోడిస్తున్నారు. అత‌ను పాక్‌కు అమ్ముడుపోయాడని,  పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.  షమీపై సోషల్‌మీడియా వేదికగా  జరుగుతున్న ఈ దాడిని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ల‌తో పాటు స‌చిన్‌టెండుల్క‌ర్‌, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌ ఖండించారు.

ప్ర‌పంచ‌క‌ప్ టీ-20లో ఎంతో ఉత్కంఠ‌ను రేకెత్తించిన భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఊహించినంత ఆస‌క్తిగా సాగలేదు. భార‌త బ్యాటింగ్ కాస్త ప‌ర్వాలేద‌నిపించినా.. బౌల‌ర్లు మాత్రం ఆశించిన మేర రాణించ‌లేక‌పోయారు. దీని వ‌ల్ల భార‌త్ పాకిస్తాన్ చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఈ ఓట‌మి త‌రువాత భార‌త ఫేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని ప‌లువురు టార్గెట్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో ఇది వివాద‌స్ప‌దంగా మారింది.  ఈ త‌రుణంలో ష‌మీకి అండ‌గా మాజీ భార‌త ఆట‌గాళ్లు నిలిచారు. మేము టీమిండియాకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డ‌మంటే జ‌ట్టులో ప్ర‌తి ఆట‌గాడికి మ‌ద్ద‌తు తెలిపిన‌ట్టే అని పేర్కొన్నారు. ష‌మీ ప్ర‌పంచ‌స్థాయిలో ఉత్త‌మ బౌల‌ర్ల‌లో ఒక‌డు. అన్ని సంద‌ర్భాల‌లో ఎవ‌రూ రాణించ‌లేరు.

 ఏదో ఒక స‌మ‌యంలో విఫ‌లం అవుతుంటారు. ష‌మీ ఈ స‌మ‌యంలో విఫ‌లం చెందాడు. టీమిండియాకు, ష‌మీకి మ‌ద్ద‌తు నిలుస్తాన‌ని తాజాగా స‌చిన్ టెండూల్క‌ర్ ట్విట్ చేశాడు. సెహ్వాగ్,  హ‌ర్భ‌జ‌న్‌, మాజీ ఫేస‌ర్ ఆర్‌పీసింగ్‌, యంగ్ బౌల‌ర్ చాహ‌ల్ కూడ ష‌మీకి మ‌ద్ద‌తు తెలిపారు. ఇదిలా ఉండ‌గా..  ఈ విషయంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడ  స్పందించారు. టీమిండియా ఓటమికి షమి ఒక్క‌డినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని ఒవైసీ పేర్కొన్నారు. షమీని టార్గెట్‌‌గా చేస్తూ  సోషల్ మీడియాలో ముస్లింల మీద విద్వేషంతో కూడిన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. క్రికెట్‌లో గెలుపు ఓట‌మిలు స‌ర్వ‌సాధార‌ణం.  టీమ్‌లో 11 మంది ప్లేయ‌ర్లున్నారు. కేవ‌లం ష‌మీనే టార్గెట్ చేస్తున్నారు. దీనిని బీజేపీ ప్ర‌భుత్వం కూడ ఖండిస్తుందా..? అని ప్ర‌శ్నించారు ఓవైసీ.
మరింత సమాచారం తెలుసుకోండి: