
` టెస్ట్ క్రికెట్‌లో నేను బ్యాగీ బ్లూ దుస్తులు ధరించి 14 సంవత్సరాలు అయింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ లాంగ్ ఫార్మాట్ లో ఇన్నేళ్లు కొనసాగుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఈ ఫార్మాట్ ఒక ఆటగాడిగా నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది మరియు జీవితాంతం నేను మోయాల్సిన పాఠాలను నేర్పింది. తెల్లటి దుస్తులు ధరించి దేశం కోసం ఆడటం అనేది ఎంతో ప్రత్యేకమైన విషయం. ఈ ఫార్మాట్ లో నిశ్శబ్దమైన ఆటతీరు, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
టెస్ట్ క్రికెట్ నుండి వైదొలగడం అంత సులభం కాదు.. కానీ నా నిర్ణయం సరైనదిగా నేను భావిస్తున్నాను. నేను ఈ ఫార్మాట్‌లో రాణించేందుకు నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చాను మరియు నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ అది తిరిగి ఇచ్చింది. క్రికెట్ కోసం, నేను మైదానాన్ని పంచుకున్న వ్యక్తుల కోసం మరియు ఈ ఫార్మాట్‌లో నన్ను సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి వ్యక్తి కోసం కృతజ్ఞతతో నిండిన హృదయంతో వెళ్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతోనే తిరిగి చూసుకుంటాను. #269.. ఇక సెలవు` అంటూ కోహ్లి ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో విరాట్ కోహ్లి అభిమానులు మరియు క్రికెట్ లవర్స్ విచారంలో మునిగిపోయారు. మిస్ యూ కింగ్ అంటూ కామెంట్ సెక్షన్ లో తమ బాధను వ్యక్త పరుస్తున్నారు.
కాగా, టెస్ట్ క్రికెట్‌లో తన 14 ఏళ్ల విశేషమైన కెరీర్‌లో విరాట్ కోహ్లి.. ఇండియా తరఫున మొత్తం 123 మ్యాచ్‌లు ఆడాడు. 46.9 సగటు 55.6 స్ట్రైక్‌రేటుతో 9230 పరుగులు తీశాడు. 30 శతకాలు, 31 అర్ధశతకాలు బాదాడు. ఈ లాంగ్ ఫార్మాట్ లో కోహ్లి అత్యధిక స్కోరు 254 నాటౌట్. అలాగే కెప్టెన్‌గా 68 టెస్ట్‌లలో 40 విజయాలు సాధించి ఇండియాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ముద్ర వేయించుకున్నాడు.