ప్రస్తుతం సోషల్ మీడియా, సెర్చింజన్ మార్కెట్లను ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు ఏలుతున్నాయి. వీటికి పోటీ ఇచ్చే సంస్థలేవీ మార్కెట్లో లేవు. చిన్న సంస్థలు అంత స్థాయికి ఎదగడం కూడా చాలా కష్టం. ఇలాంటి సమయంలో బ్రిటన్ ప్రభుత్వం ఈ బడా కంపెనీలపై కొన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల చిన్న కంపెనీలకు మార్కెట్లో పోటీ పడే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కొత్త చట్టం ప్రకారం.. గూగుల్, ఫేస్‌బుక్ వంటి బడా టెక్ ప్లాట్‌ఫామ్‌ల శక్తి సామర్ధ్యాలను కొంత మేర నియంత్రించే అవకాశం ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రస్తుత మోడ్రన్ యుగంలో వీటి ప్రభావం ప్రజలపై ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. దీనికోసం కాంపిటీటివ్ అండ్ మార్కెట్స్ అథారిటి (సీఎమ్ఏ)కు ప్రత్యేకంగా ఓ డిజిటల్ మార్కెట్స్ యూనిట్‌ను కేటాయిస్తారు. టెక్నాలజీ సంస్థలు ఎలాంటి నిబంధనలు పాటించాలి? వాటిని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకునే వీలుంటుంది? వంటి విషయాలను ఈ కొత్త యూనిట్‌లోనే నిర్ణయిస్తారు.

 ఈ నిబంధనలు అన్ని కంపెనీలపైగా ఉండవట. వ్యూహాత్మక మార్కెట్ విలువ ఉన్న కంపెనీలపైనే ఆంక్షలు విధిస్తారట. మరి ఈ జాబితాలో ఎలాంటి కంపెనీలు ఉంటాయి? వంటి వివరాలు ఇంకా ప్రభుత్వ అధికారులు వెల్లడించలేదు. ఏది ఏమైనా గూగుల్, ఫేస్‌బుక్ వంటి బడా కంపెనీలపై ఆంక్షలు విధించి, చిన్న కంపెనీలను వదిలేస్తే ఇన్నొవేషన్ స్థాయులు పెరుగుతాయని, కొత్త వారు ఈ మార్కెట్లో ప్రవేశిస్తారని నిపుణులు అంటున్నారు.

గూగుల్ వంటి కంపెనీలతో చిన్న కంపెనీలు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుందని వారు చెప్తున్నారు. సోషల్ మీడియా మార్కెట్లో గూగుల్, ఫేస్‌బుక్ వంటి బడా కంపెనీల ఆధిపత్యాన్ని కొంత మేర తగ్గించేందుకే యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. మరి యూకే నిర్ణయం చూసి ఇంకా ఎన్ని దేశాలు ఇదే బాటలో నడుస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: