2027 ఆగస్టు 2 తేదీ ప్రపంచ ఖగోళ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు కానుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది,  సాధారణంగా సూర్యగ్రహణాలు తరచుగా జరిగే సహజ ప్రక్రియలైనా, ఈసారి జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం అసాధారణమైన అరుదైన సంఘటనగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ గ్రహణం ప్రత్యేకత ఏమిటంటే—దీని వ్యవధి. ఖగోళ శాస్త్ర నిపుణుల లెక్కల ప్రకారం, 2027 సూర్యగ్రహణం గత 123 సంవత్సరాలలో అత్యంత పొడవైన సంపూర్ణ సూర్యగ్రహణంగా రికార్డవుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పే దశ — సంపూర్ణ గ్రహణ దశ — 6 నిమిషాలు 23 సెకండ్ల పాటు కొనసాగనుంది. సాధారణంగా సంపూర్ణ గ్రహణాలు 2–3 నిమిషాల్లో ముగిసిపోతాయి. కానీ ఈసారి ప్రపంచం అరుదైన చీకటి క్షణాన్ని చాలా ఎక్కువ సమయం పాటు ఆస్వాదించే అదృష్టాన్ని పొందనుంది.


అపూర్వ సహజ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు, నేచర్ లవర్స్— ఒకే దిశగా దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి పొడవైన గ్రహణాలు శతాబ్దంలో ఒక్కసారే జరుగుతాయి. అందుకే దీనిని “శతాబ్ద గ్రహణం” అని కూడా పిలవడం ప్రారంభించారు. ఈ సూర్యగ్రహణం ఉత్తర ఆఫ్రికా నుంచి దక్షిణ యూరప్ వరకు విస్తరించిన విస్తారమైన ప్రాంతంలో స్పష్టంగా కనిపించబోతోంది. ముఖ్యంగా మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు సంపూర్ణ గ్రహణ దృశ్యాన్ని అత్యద్భుతంగా వీక్షించే అవకాశాన్ని పొందనున్నాయి. ఈ ప్రాంతాల్లోని విస్తారమైన ఎడారులు, స్వచ్ఛమైన ఆకాశాలు, మబ్బులు తక్కువగా ఉండే సహజ పరిస్థితులు గ్రహణ వీక్షణానికి ప్రత్యేక అనుకూలం కావడంతో వేలాది మంది ఖగోళ ప్రేమికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.



ఖగోళ నిపుణుల అంచనాల ప్రకారం, వాతావరణ పరంగా అత్యంత అనుకూల పరిస్థితులు లిబియా మరియు ఈజిప్ట్ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఎక్కువ. ఈ దేశాల్లో వేసవి కాలంలో ఆకాశం తరచుగా నిర్మలంగా ఉంటుంది. అందువల్ల సంపూర్ణ గ్రహణాన్ని ఏ విధమైన అంతరాయం లేకుండా, ఆకాశం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో చూడగల అవకాశం ఉంది. కొన్నిచోట్ల ప్రత్యేకంగా ఎడారి ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి గ్రహణాన్ని పరిశీలించేందుకు టూరిజం కంపెనీలు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించాయి.


అయితే ఎంత పొడవైన గ్రహణమైనా సూర్యుడిని నేరుగా చూడటం మాత్రం చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రత్యేక గ్రహణ కళ్లజోడులు, సోలార్ ఫిల్టర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఖరీదైన సన్ గ్లాసులు, ఫోటోఫిల్టర్ గ్లాసులు, రంగు గాజులు—అల్ల్ ఇవేమీ సూర్యుని కిరణాలను అడ్డుకోలేవు. కళ్లకు ప్రమాదం తప్పించాలంటే ఖచ్చితంగా ISO ప్రమాణాలు కలిగిన గ్రహణ గ్లాసులు మాత్రమే ఉపయోగించాలి. అనేక దేశాలు గ్రహణ టూరిజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక వీక్షణ కేంద్రాలు, శాస్త్ర శిబిరాలు, పబ్లిక్ వీయింగ్ జోన్లు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సిద్ధతలు ప్రారంభించాయి.



2027 ఆగస్టు 2 సూర్యగ్రహణం ఒక అరుదైన ఖగోళ సంఘటన మాత్రమే కాదు—ప్రపంచాన్ని ఒక్కచోటికి చేర్చే అపూర్వ క్షణం. సహజ అద్భుతాలను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఇది జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అనుభవంగా నిలిచిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: