రాతి యుగం నాటి మనిషి మెల్లగా తన జీవనానికి సంబంధించి నిప్పుకనుగొనడం నుండి వరుసగా ఒక్కొక్కటిగా ఎన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి, నేడు ఏకంగా ఇతర గ్రహాలపై కూడా కాలు మోపే ఊహించలేని స్థాయికి చేరుకున్నాడు.ఆ విధంగా ఎన్నో విధాలుగా అత్యున్నత శిఖరాలను అందుకున్న మనిషి, మానసికముగా మాత్రం రోజు రోజుకు దిగజారిపోతున్నాడు. అంతేకాదు మనిషి ఆలోచనలు ఒకరకంగా జంతువుల కంటే కూడా పైశాచికంగా తయారవుతున్నాయి. ఒక నాడు గాంధీ గారు చెప్పినట్లు ఎప్పుడైతే స్త్రీ ఒంటరిగా రాత్రి సమయంలో నడిరోడ్డుపై స్వేచ్ఛగా తిరుగగలదో, అప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని ఆయన అన్నారు. అయితే ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆయన వ్యాఖ్యలు ఇనాళ్ళు గడిచినా కూడా నిజం కాకపోగా, నేడు పగటి సమయాన కూడా స్త్రీలు బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాక, మాటల్లో వర్ణించడానికి కూడా వీలు లేని విధంగా నేటి సమాజంలోని కొందరు మృగాళ్లు చిన్న పిల్లలను సైతం లైంగికంగా వేధించడం చూస్తున్నాం. 

ఇక స్త్రీలపై ఈ విధమైన అత్యాచారాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మరింతగా పెరిగిపోయాయి అని ప్రస్తుత గణాంకాలు చెప్తున్నాయి. ఇక కాలేజీ విద్యార్థినుల పరిస్థితి అయితే మరింత ఘోరంగా తయారయింది. ఎప్పటికపుడు వారి కదలికలను, వారి ఇంట్లోని వారు జాగ్రత్తగా పరిశీలించుకోవలసి వస్తోంది. అయితే ఈ విధంగా మన సమాజంలో స్త్రీల పరిస్థితి ఇంతిదిగా దిగజారిపోవడానికి, అలానే వారి మానాలకు రక్షణ లేకపోవడానికి నేటి సమాజ పరిస్థితులు ఒక ముఖ్యకారణగా చెప్తున్నారు మానసిక నిపుణులు. ఒకప్పుడు మెల్లగా ఒక్కొక్కటిగా పాశ్చాత్య వస్తువులు దిగుమతి చేసుకున్న మన దేశ ప్రజలు, వాటితో పాటు అక్కడి పరిస్థితులను కూడా అలవరుచుకుంటున్నారు. అదీకాక మన దేశంలో స్త్రీలపై జరిగే దాడులకు తగిన రీతిన భారతీయ శిక్షాస్మృతి కూడా వ్యవహరించడం లేదనే అపవాదు ఇప్పటికీ కొందరి నుండి వినపడుతూనే ఉంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా స్త్రీలపై జరిగే ఈ పైశాచిక దాడులకు ఒకరకంగా నేటి తల్లితండ్రులు కూడా కారణం అవుతున్నారనేది మానసిక నిపుణుల మరొక వాదన. 

ప్రతి మగ బిడ్డకు చిన్నప్పటి నుండి, తల్లి, చెల్లి, అక్క, భార్య, పరాయి స్త్రీ, ఇలా అతడి జీవితంలో ప్రతి ఒక్కరి గురించి తల్లితండ్రులు తమ బిడ్డలకు చిన్నప్పటినుండి తెలియచెప్పాలని, అలానే మరీ ముఖ్యంగా స్త్రీ లేనిదే సమాజ మనుగడ మరియి గమనం లేదు, స్త్రీలను పూజించడం, మరియు పరాయి స్త్రీ అంటే తల్లితో సమానం వంటి అంశాలు వారికి విద్యాబుద్ధుల వలే ఎప్పటికపుడు తప్పనిసరిగా చెప్పాలని వారు అంటున్నారు. ఆ విధంగా తల్లితండ్రులు గనుక వారిని చిన్నప్పటినుండి పెంచగలిగితే, మెల్లగా మన సమాజములో మార్పు మొదలవుతుందనేది వారు చెప్తున్న మాట. అయితే ఎన్ని చెప్పినప్పటికీ ప్రతి ఒక్క మగవాడి స్త్రీల పట్ల ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది, కాబట్టి అందరు మగవాళ్లకు కూడా స్త్రీల పట్ల ఎప్పుడైతే ఒకే విధమైన మంచి అభిప్రాయం ఏర్పడుతుందో, అప్పుడే మన సమాజంలో స్త్రీకి రక్షణ అనేది ప్రతి ఒక్క మగవారు గుర్తించాలి......!!      


మరింత సమాచారం తెలుసుకోండి: