
సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ను పోలీసులు అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. అందులో భాగంగా చిలకలూరిపేటలో జరిగిన ఆందోళనలో సరిగా విధులు నిర్వహించలేదంటూ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు అంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది.
ఇద్దరు పోలీస్ అధికారులను వీఆర్ కు బదిలీ చేశారన్నది వార్త సారంశం. చంద్రబాబు ను తరలిస్తున్న కాన్వాయ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట చేరుకునే సమయానికి అక్కడ టీడీపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కాన్వాయ్ గంటకు పైగా నిలిచిపోయింది. తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై 20 నిమిషాలకు పైగా అంతరాయం కలిగింది. దీంతో నిరసన తెలుపుతున్న వారిని చెదరగొట్టేందుకు స్వయంగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి బరిలోకి దిగి లాఠీ ఛార్జి చేశారు.
ఈ చర్యలకు ప్రతి చర్యగా రూరల్ సీఐ అచ్చయ్య, టౌన్ సీఐ రాజేశ్వరరావులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. గుంటూరు రేంజ్ డీఐజీ వీరికి ఈ నెల 25న వీఆర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. వీరు ప్రస్తుతం అసెంబ్లీ బందోబస్తులో ఉండటంతో విధులు ముగిశాక అధికారికంగా సాగనపంబోతున్నారు. ఇప్పటికే వాళ్ల స్థానంలో కొత్తగా ఇద్దరి పేర్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే ఘటనలో ఓ పోలీస్ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.