పోలింగ్ కి ఇంకా రెండు రోజుల మాత్రమే సమయం ఉన్న సమయంలో.. ప్రచారానికి  తెరపడుతున్న చివరి రోజు కేసీఆర్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరింది. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నలువైపులా ప్రచారంలో దూకుడు కొనసాగించారు. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో దూసుకుపోయింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తామేం తక్కువ కాదని ప్రచారంలో జోరు చూపించింది.


ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభలు మరో ఎత్తు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండటం తెలంగాణ వ్యాప్తంగాచర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సీఎం కేసీఆర్ ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శిస్తుంటారు. గత ఎన్నికల్లో అయితే ఆయన కాంగ్రెస్ కూటమిపై ఒంటికాలుపై లేచారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు కొనసాగించారు. ఈ సారి ఎన్నికల్లో ప్రారంభంలో అదే ధోరణి కొనసాగించినా క్రమక్రమంగా కాస్త మెత్తబడ్డారు.


ఇప్పుడు చివరి దశలో తన ప్రసంగాన్ని మార్చేశారు. నాకు 70 ఏళ్లు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కూడా నాకుంది. ఈ పదవులు ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఎన్నికల్లో ఓడిపోయినా లేదా గెలిచినా తెలంగాణలో నా పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఏమైంది సీఎం కేసీఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. రాజకీయ వైరాగ్యమా.. లేక వ్యూహంలో భాగమా అని తెగ చర్చించుకుంటున్నారు.


ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఒకరకమైన వైరాగ్యాన్ని ప్రదర్శించారు. మహా అయితే ఓడిపోతాం. ఇంతకుమించి ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు. కేసీఆర్ నుంచి ఇలాంటి మాటలు ఊహించని పార్టీ శ్రేణులు తెర వెనుక ఏదో జరుగుతుంది అనే సందేహంలో పడ్డారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ ఓటమి ఒప్పుకున్నారు అనే ప్రచారాన్ని చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో సెంటిమెంట్ రగల్చేందుకు గులాబీ బాస్ యత్నించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: