
ఇక ఏపీలో జగన్ చెప్పినట్టు రెండున్నర సంవత్సరాలకు మంత్రి వర్గాన్ని మార్చాలి. అయితే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు దాటేసింది. వచ్చే ఏప్రిల్, మేకు మూడు సంవత్సరాలు పూర్తవుతాయి. ఉగాదికి మంత్రి వర్గాన్ని మార్చుతారని అంటున్నారు. అదే జరిగితే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది మంత్రులు మంత్రి వర్గం నుంచి అవుట్ అవుతారు. వీరి స్థానాల్లో కొత్త వారు మంత్రులు అవుతారు. అయితే ఇప్పుడు జిల్లాల విభజన అంశం కొందరికి షాక్ ఇచ్చేలా ఉంది. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా మంత్రి వర్గంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఈ సారి మార్పుల్లో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ముందు నుంచి ఉన్నారు. అయితే ఇప్పుడు జిల్లాల విభజన అంశం ఆమె ఆశల మీద నీళ్లు చల్లింది. నగరి చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు. ఆయన పుంగనూరు చిత్తూరు జిల్లాలో చేర్చారు. పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించరు. అయితే చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడిన శ్రీ బాలాజీ జిల్లాలో చేర్చారు.
అంటే చెవిరెడ్డి ఇప్పుడు బాలాజీ జిల్లాలో ఉన్నారు. ఆ జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కొత్త వారే. వారు చెవిరెడ్డికి పోటీ కారు. ఈ జిల్లా కోటాలో మంత్రి అయ్యేందుకు చెవిరెడ్డికే ఛాన్సులు ఉన్నాయి. బాలాజీ జిల్లాలో తిరుపతి - శ్రీకాళహస్తి - సత్యవేడు - సూళ్లూరుపేట - గూడూరు - వెంకటగిరి - చంద్రగిరి నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ భాస్కర్ రెడ్డి కింగ్ అయిపోయారు. చిత్తూరు కోటాలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉంటే.. బాలాజీ జిల్లా కోటాలో ఇప్పుడు చెవిరెడ్డికి మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
ఇక రోజా చిత్తూరు జిల్లాలో ఉండడంతో ఆమె ఆశలు అన్నీ అడియాసలు అయిపోయాయి. ఏదేమైనా అసలే రోజా మంత్రి పదవి ఛాన్సులు అంతంత మాత్రంగా ఉంటే ఇప్పుడు జిల్లాల ఏర్పాటు ఆమె ఆశలను మరింత అడియాసలు చేసింది.