లాక్ డౌన్ అమల్లో ఉన్నపుడు కొందరు వైసిపి ఎంఎల్ఏలపై విచిత్రమైన కేసు నమోదైంది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ ఐదుగురు అధికార వైసిపి ఎంఎల్ఏలపై హైకోర్టు న్యాయవాది కిషోర్ కేసు వేయటం విచిత్రంగా ఉంది.  కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం లేదని, జనాల్లో తిరిగేస్తున్నారంటూ న్యాయవాది కోర్టుకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుతో పాటు సదరు ఎంఎల్ఏలు తమ నియోజకర్గాల్లో తిరుగుతున్న ఫొటోలు, వీడియాలను కూడా జత చేశాడు.

 

శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మదుసూధనరెడ్డి, నగిరి ఎంఎల్ఏ రోజా, చిలకలూరిపేట ఎంఎల్ఏ విడదల రజని, సూళ్ళూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య, పలమనేరు ఎంఎల్ఏ వెంకటగౌడకు వెంటనే కరోనా వైరస్ టెస్టు జరపాలనే డిమాండ్ తో న్యాయవాది వీళ్ళపై కేసు వేయటం సంచలనంగా మారింది. నిజానికి న్యాయవాది చెప్పిన ఎంఎల్ఏలు బాధితులకు నిత్యావసరాలు అందుతున్నాయా లేదా చూస్తున్నారు. జనాలకు అవసరమైనవి అందేట్లు అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నారు.

 

రోజు కొన్ని వేలమందికి ఉచిత భోజనాల ప్యాకెట్లు అందిస్తున్నారు. కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు  లాంటి నిత్యావసరాలను అందిస్తున్నారు. చాలామంది ఎంఎల్ఏలు తగిన జాగ్రత్తలు తీసుకునే పంపిణి కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా పర్యవేక్షిస్తున్నారు.  సరే ఎక్కడైనా కొందరి అత్యుత్సాహం కారణంగా వైసిపి ఎంఎల్ఏల చర్యలు విమర్శలపాలైతే అయ్యుండచ్చు.  అంతమాత్రాన ప్రజా ప్రతినిధులను జనాల్లో తిరక్కుండా ఇళ్ళల్లోనే కూర్చోవాలని కూడా ఎవరూ చెప్పలేరు.

 

జనాల్లో తిరుగుతున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పటంలో తప్పేలేదు. అంతే కానీ ఎంఎల్ఏలకు వైరస్ టెస్టులు చేయించాలని కోరుతు కోర్టులో పిటీషన్ వేయటమే విచిత్రంగా ఉంది. అసలు న్యాయవాది ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావటం లేదు. ఎంఎల్ఏల పై కోర్టులో కేసు వేయటం ద్వారా వ్యక్తిగత ప్రచారాన్ని కోరుకుంటున్నట్లే ఉంది. పలానా వ్యక్తులకు కరోనా వైరస్ టెస్టులు చేయాలని ఆదేశించాలంటూ కోర్టులో కేసు వేయటం చూస్తే ఇలాగే ఉంది.

 

అనుమానితులకు అధికారులు ఎలాగూ టెస్టులు చేయిస్తునే ఉన్నారు. ఒకవేళ ఎంఎల్ఏలకే టెస్టులు చేయించుకుంటే బాగుంటుందనే అనుమానం వస్తే వాళ్ళే టెస్టులు చేయించుకుంటారు కదా ? మధ్యలో ఈ న్యాయవాదికి ఏమిటి నొప్పి ?  బాధితులకు, పంపిణి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న ఎంఎల్ఏలకు లేని బాధ మధ్యలో న్యాయవాదికి అవసరం లేదు. అయినా వాళ్ళపై కోర్టులో వేయటమంటే కేవలం ప్రచారం కోసమే కేసు వేసినట్లుంది చూస్తుంటే. చూద్దాం కోర్టు ఏమి చెబుతుందో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: