సాక్షి టీవీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన సొంత ఛానల్.. జగన్ ను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన అనేక అంశాల్లో సాక్షి మీడియా ఒకటి. సాక్షి పత్రిక సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం సాక్షి టీవీ ఆదరణ క్రమంగా తగ్గుతోంది. తాజా రేటింగ్స్ ఈ అంశాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ రేటింగ్స్ చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది.

 

 

హైదరాబాద్ మార్కెట్ తాజా రేటింగ్స్ లో ఎప్పటి లాగానే టీవీ9 టాప్ ప్లేసు కొట్టేసింది. ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. సెకండ్ ప్లేసులో కొన్నాళ్లుగా ఉంటున్న వీ6 తన స్థానం మరోసారి నిలబెట్టుకుంది. ఆ తర్వాత స్థానం టీ న్యూస్ ది. తెలంగాణ రాజధానిలో తెలంగాణ ఛానళ్లకు ఆ మాత్రం ఆదరణ దక్కడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోవచ్చు.

 

 

 

ఇక ఆ తర్వాత స్థానాల్లో ఎన్టీవీ, టీవీ 5 పోటీ పడ్డాయి. ఎన్టీవీ నాలుగో స్థానంలోనూ.. టీవీ5 ఐదో స్థానంలోనూ నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో హెచ్ ఎంటీ వీ, ఈటీవీ తెలంగాణ, ఏబీఎన్‌, టెన్ టీవీ నిలిచాయి. ఆ తర్వాత అక్షరాలా పదో స్థానంలో సాక్షి టీవీ నిలిచింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు ఉన్న సాక్షి టీవీ హైదరాబాద్ లో మరీ పదో స్థానానికి పడిపోవడం అంటే అది జీర్ణించుకోలేని పరిణామమే.

 

 

మరి సాక్షి టీవీ ఎందుకు మరీ అంతగా రేటింగుల్లో తన స్థానం కోల్పోతోంది. అసలు సాక్షి టీవీ ప్రారంభమే ఓ సంచనంగా మొదలైన సంగతి మీడియా వర్గాల్లో చాలా మందికి తెలుసు. లైవ్ ఇచ్చే ఓబీ వ్యాన్లు ఛానళ్లకు మూడో, నాలుగో ఉండటం గొప్ప అనుకునే రోజుల్లోనే జిల్లాకో ఓబీ వ్యాన్ ఉన్న ఏకైక ఛానల్ గా సాక్షిని చెప్పుకుంటారు. మరి లోపం ఎక్కడ.. ఈ విషయంపై సాక్షి ఆలోచించుకుంటుందా.. లేదా స్వామి సేవలో తరిస్తే చాలు.. రేటింగులు ఎవడిక్కావాలి అని సైలంటయిపోతుందా.. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: