
సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి విభజన హామీలతోపాటు, పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కూడా చర్చకు వస్తోంది. సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలని జగన్ కోరడం, కేంద్రం కొర్రీలు వేయడం సహజంగా జరిగేదే. అయితే ఈసారి జగన్ ఢిల్లీ పర్యటన పోలవరంపై ఏం తేల్చిందనేదే ఇప్పుడు చర్చ. పోలవరంపై కేంద్రం చీవాట్లు పెట్టిందని ఆంధ్రజ్యోతి కథనం ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు భేష్ అంటూ ప్రశంసించిందని సాక్షి రాసుకొచ్చింది. ఇంతకీ వీటిలో ఏది నిజం? ఎంత నిజం..?
సాక్షి ఏం చెప్పిందంటే..?
పోలవరం స్పిల్ వే పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసినందుకు కేంద్ర జల శక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిందని, జూన్ లోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారని, వచ్చే సీజన్ లో పనులు పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో.. దానిపై సమగ్ర నివేదిక కోరినట్టు చెప్పింది. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి కొంత స్పష్టత కోరిన కేంద్రం.. వాటిపై వివరణ ఇస్తే పెట్టుబడి అనుమతి జారీ చేస్తామని చెప్పిందట. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 70.10శాతం, పునరావాసం పనులు 20.19శాతం.. మొత్తం కలిపి 41.10శాతం పూర్తయ్యాయని రాష్ట్ర అధికారులు సమీక్షలో వివరించారట. సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే 2022నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారులు హామీ ఇచ్చారట. దీనికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ సానుకూలంగా స్పందించారనేది సాక్షి వార్త సారాంశం..
ఆంధ్రజ్యోతి ఏం చెప్పిందంటే..?
పోలవరం పనులు నత్తనడకన జరుగుతున్నందుకు కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసిందనేది ఆంధ్రజ్యోతి కథనం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పనులు జరగలేదని అసహనం వ్యక్తం చేయడంతోపాటు, ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులపై పెట్టిన శ్రద్ధ, పునరావాసం, భూసేకరణపై పెట్టలేదని నిలదీసిందట. అంచనా వ్యయం పెంచాలంటే మళ్లీ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందాలని, దీనికోసం కేంద్ర పెద్దలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని నీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది.
ఎవరి వాదన ఎలా ఉన్నా.. పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే విషయం మాత్రం వాస్తవం. ప్రాజెక్ట్ పనులు చకచకా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారే కానీ, నిర్వాసితుల విషయాన్ని పట్టించుకోవడంలేదు. గతంలో పలుమార్లు నేతలు, అధికారుల్ని నిర్వాసితులు నిలదీసినా ఫలితం లేదు. పునరావాసం పనులు కేవలం 20శాతం మాత్రమే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంక్రీట్ పనులపై పెట్టిన శ్రద్ధ, పునరావాసంపై పెడితే ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్న కుటుంబాలకు న్యాయం చేసినట్టవుతుంది.