రాహుల్ గాంధీ బలమైన పోటీదారు కాకపోవడం వల్ల.. ఇన్నాళ్లూ కేంద్రంలో మోదీ ఆడింది ఆటా, పాడింది పాటా అన్నట్టు సాగుతోంది. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే బీజేపీ ప్రభుత్వానికి ఎదురు లేకుండా పోయింది. కానీ ఇప్పుడీ పరిస్థితులు మారుతున్నాయి. 2024 ఎన్నికలనాటికి కాంగ్రెసేతర పక్షాలన్నీ ఒక్కటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినా అది సాధ్యం కాలేదు, కానీ ఈసారి కేజ్రీవాల్ ఆధ్వర్యంలో మూడో కూటమి బలంగా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంకేతాలివే..
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా తగ్గింది, కాంగ్రెస్ బలం కూడా పడిపోయింది. అదే సమయంలో స్థానిక పార్టీలన్నీ ఎక్కడలేని శక్తి పుంజుకున్నాయి. ఇవన్నీ ఒక్కటైతే 2024నాటికి మోదీకి తలనొప్పిగా మారడం ఖాయం. వచ్చే ఏడాది జరగబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పవనాలు లేవనే విషయం ఇప్పటికే స్పష్టమవుతోంది.

కేజ్రీవాలే ఎందుకు..?
గతంలో మోదీకి పోటీ నితీష్ కుమార్ అంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే ఆయన సొంత రాష్ట్రం బీహార్ నే చక్కదిద్దుకోలేక చతికిలపడ్డారు. ఇటీవల కాలంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ గురించి ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారిద్దరూ. ఇటు దక్షిణాదిలో కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా.. కేసీఆర్ కానీ, జగన్ కానీ, స్టాలిన్ కానీ, నవీన్ పట్నాయక్ కానీ.. నేరుగా మోదీని ఢీకొనలేరు. అదే సమయంలో మూడో కూటమి బలపడుతుంది అనుకుంటే.. కచ్చితంగా బీజేపీని అణగదొక్కడానికే ప్రయత్నిస్తారు. అంటే.. 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు బలపడితే బీజేపీ ప్రభుత్వం కూలినట్టే లెక్క.

అందులోనూ కేజ్రీవాల్, నేరుగా మోదీని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. పంజాబ్  లో పట్టు పెంచుకుంటోంది, బీహార్ లో కూడా ఓటు బ్యాంకు బాగా ఉంది. 2022లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామంటూ ఇటీవలే ప్రకటించారు కేజ్రీవాల్. మెల్లగా గుజరాత్ లో కూడా బలం పెంచుకుని ఉత్తరాదిని చుట్టేయాలనే ప్లాన్ లో ఉన్నారాయన. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మచ్చలేని పాలన అందిస్తున్నారే పేరు ఆయనకి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ కంటే వంద రెట్లు కేజ్రీవాల్ బెటర్ అనేవారూ ఉన్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ని నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేజ్రీవాల్ వ్యవహారం మోదీకి ముందస్తు హెచ్చరికలాంటిది.


మరింత సమాచారం తెలుసుకోండి: